వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ కరెన్సీ
- చలామణిలోకి రూ.10, రూ.20 నోట్లు
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు
- నకిలీ నోట్ల తయారీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
న్యూఢిల్లీ, జూలై ౧౮: నకిలీ నోట్ల దందాకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముమ్మర కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగానే వచ్చే ఏడాది నుంచి రూ.10, రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ సరఫరాదారుల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించింది. నోట్ల తయారీకి సుమారు 68 వేల రీముల షీట్లు కావాలని టెండర్లలో పేర్కొంది.
నోట్ల ముద్రణకు అవసరమైన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లను సరఫరా చేయాలని ఆయా సంస్థలను కోరింది. ప్రాజెక్ట్ కోసం కరెన్సీ ప్రింటింగ్ విభాగం గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) జారీ చేసింది. షీట్లలో అత్యాధునికమైన సెక్యూరిటీ ఫీచర్లు, విండో పోర్ట్రెయిట్, మెటాలిక్ నంబర్లు ఉండాలని నిబంధనలు పెట్టింది. అంతేకాదు.. టెండర్ ప్రక్రియలో భాగంగా చైనా, పాకిస్తాన్ దేశాలతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేని సంస్థలనే ఎంపిక చేయనుంది.
ఆయా దేశాల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ముడిసరుకును తీసుకోకూడదని తేల్చిచెప్పింది. సదరు సంస్థలకు గతంలో ఏదైనా కేంద్ర బ్యాంకుకు పాలిమర్ షీట్లు సరఫరా చేసిన ట్రాక్ రికార్డ్ ఉండాలని, జంతువుల కొవ్వుగానీ, డీఎన్‌ఏ అవశేషాలుగానీ లేవని ల్యాబ్ సర్టిఫికెట్లు సమర్పించాలని సూచించింది. టెండర్ల సమర్పణకు ఆగస్టు 18వ తేదీ చివరి గడువు. ప్లాస్టిక్ నోట్లను ప్రపంచంలోనే మొదటిసారిగా 1988లో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీనే చలామణిలో ఉంది.






