19 July, 2026 | 3:52 AM

బుల్లెట్ ట్రైన్ మాకొద్దు!

19-07-2026 01:21 AM
  1. బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత 
  2. బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 650 ఎకరాల భూ సేకరణ
  3. భూమి చుట్టూ కంచె వేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారుల కసరత్తు
  4. వెయ్యి మందికి పైగా పోలీసుల మోహరింపు
  5. పోలీసులపై కారం చల్లి, రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు
  6. డీసీపీ యోగేష్ గౌతమ్, సీఐలకు గాయాలు 

రంగారెడ్డి, జూలై 18 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూ డ గ్రామంలో శనివారం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు (హబ్) కోసం సేకరించినట్లు చెబుతున్న సుమారు 650 ఎకరాల భూమి చుట్టూ కంచె వేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారులు వెయ్యి మందికి పైగా పోలీసుల భారీ బందోబస్తుతో రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయి రణరంగంగా మారింది.

అధికారుల చర్యను నిరసిస్తూ రైతులు, గ్రామస్థులు ఎదురుతిరగడంతో పరిస్థితి చేయిదాటింది. గత ఐదు రోజులుగా ఇక్కడ భూముల విషయమై ఆందోళన లు కొనసాగుతున్నాయి. హైడ్రా, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికార పర్యవేక్షణలో భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. సర్వే నెంబర్ 68తో పాటు మరో చోట అక్రమ కట్టడాలను తొలగిస్తూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

అయితే, తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, నష్టపరిహారం చెల్లింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో శ్రీధర్‌తో రైతులు, మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులపై కారం చల్లి, రాళ్లు, కుర్చీలు విసరడంతో డీసీపీ యోగేష్ గౌతమ్, సీఐలకు గా యాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, బయటి వ్యక్తులకు అనుమతి లేదంటూ అధికారులు బోర్డులు పాతారు.

రైతులను చెదరగొట్టి కంచె వేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో నరసింహ అనే స్థానిక రైతు తీవ్ర ఆందోళనకు గురై స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, తోటి రైతులు అంబులెన్సును అడ్డుకున్నారు. ‘మా భూములకు సరైన న్యాయం జరిగే వరకు, పరిహారంపై స్పష్టత వచ్చే వరకు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా తాకనివ్వం. ప్రాణాలు పోయినా సరే కంచె వేయనిచ్చేది లేదు‘ అని రైతులు తెగేసి చెప్పారు.

పోలీసులపై కారం పొడితో దాడి

మధ్యాహ్న సమయానికి నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అధికారులు ఫెన్సింగ్ పనులను ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి తిరగబడ్డారు. వెంట తెచ్చుకున్న కారం పొడిని పోలీసులపై చల్లడమే కాకుండా, అక్కడే ఉన్న కుర్చీలను వారిపైకి విసిరేశారు. ఈ దాడిలో డీసీపీ యోగేశ్ గౌతమ్ కళ్లలో కారం పడటంతో వెంటనే సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పలువురు సీఐలకు కూడా గాయాలైనట్టు తెలిసింది. ఈ ఘర్షణల నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలిచిన పలువురు రాజకీయ, స్థానిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైడ్రా ఎంట్రీతో పెరిగిన భయం

సాధారణంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రమే ఇలాంటి చర్యల్లో పాల్గొంటాయి. కానీ ఈసారి హైడ్రా బలగాలను రంగంలోకి దించడం చూస్తే, ప్రభుత్వం ఈ భూసేకరణను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ముందస్తు నోటీసులు లేదా చర్చలు లేకుండా ఏకపక్షంగా కంచె వేయడానికి రావడం స్థానికుల్లో మరింత భయాందోళనలకు, ఆగ్రహానికి కారణమైంది.

మాకు పట్టాలు ఉన్నాయి: రైతుల వాదన

కొందరు రైతులు మాట్లాడుతూ.. ‘మా వద్ద భూములకు సంబంధించిన స్పష్టమైన పట్టాలు ఉన్నాయి.ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పునరావాసం, భవిష్యత్ భద్రతపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్వాధీన ప్రక్రియ చేపట్టాలి’ అని పట్టుబడుతున్నారు.

తాము అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే తమ హక్కులు, ప్రయోజనాలకు రక్షణ కల్పించిన తర్వాతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే అధికారులు మాత్రం ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని, ప్రాజెక్టు అవసరాల కోసమే నిబంధనల ప్రకారమే స్వాధీనం చేసుకుంటున్నామని చెపుతున్నారు.

పంటలను పాడు చేస్తలేం: డీసీపీ

ఈ ఘటనపై డీసీపీ యోగేశ్ గౌతమ్ స్పం దిస్తూ.. ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదు. మేము కేవలం ప్రభుత్వ భూమికి రక్షణగా ఫెన్సింగ్ మాత్రమే వేస్తున్నాం. రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు ఎలాంటి నష్టం కలిగించడం లేదు. సమస్యలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలపాలి కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం‘ అని హెచ్చరించారు.

రైతులకు బీఆర్‌ఎస్ మద్దతు

బహదూర్గూడ రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రైతులకు న్యాయం చేయకుండా భూములు తీసుకోవడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రస్తుతం బహదూర్గూడలో పరిస్థితి ’నివురు గప్పిన నిప్పు’ లా మారింది. ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసు బందోబస్తును మోహరించడంతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.