మునిగిపోతున్న ‘వ్యాప్కోస్’!
- ఆర్థిక సంక్షోభంలో సంస్థ
- ఢిల్లీ హైకోర్టులో అంగీకరించిన న్యాయవాది
- కాళేశ్వరం నుంచి సింగరేణి వరకు వ్యాప్కోస్ పాత్ర
- టెండర్లు లేకుండానే డీపీఆర్ అప్పగింత
- ప్రాజెక్టుల నాణ్యతపై తక్షణ సమీక్ష అవసరమంటున్న నిపుణులు
హైదరాబాద్, జూలై 1౮ (విజయక్రాంతి): కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యాప్కోస్ లిమిటెడ్’ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. సిబ్బందిని కాపాడుకోవడానికి సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వ్యాప్కోస్ ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా సంస్థ తరఫు న్యాయవాదే ఈ అంశాలను వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే సంస్థ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించడమే కాకుండా, సింగరేణి చేపడుతున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల నాణ్యత, డీపీఆర్‌లపై ప్రభుత్వం తక్షణం సమీక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోర్టులో వాదనలు..
ఆర్థిక సంక్షోభంపై వ్యాప్కోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈనెల 6న ఇచ్చిన ఆదేశాల మేరకు.. సంస్థ తరఫు న్యాయవాది శర్మ కోర్టులో తన వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని కోర్టుకు సమర్పించారు.
క్రమబద్ధీకరణ కోరుతూ సంస్థ సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సిబ్బందిని క్రమబద్ధీకరిస్తే సంస్థపై అదనపు భారం పడుతుందని, తద్వారా సంస్థ మనుగడ ప్రమాదంలో పడుతుందని వాదించారు. 1969లో స్థాపించిన వాప్కోస్ సంస్థ.. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలలో 75కు పైగా దేశాల్లో సేవలను అందిస్తుందన్నారు.
ఏకీభవించని న్యాయస్థానం
వాప్కోస్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు అఫిడవిట్‌లలో ఎటువంటి ఆధారాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ బ్యాలెన్స్ షీట్లను, వ్యాప్కోస్‌కు మంజూరైన 1,541 పోస్టులలో 682 పోస్టులను రద్దు చేయడానికి గల కారణాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. గతంలో జరిగిన నియామక ప్రక్రియల్లో అక్రమాలు జరిగాయని అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోస్టుల రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు.
అధికారుల వివరణ
సంస్థను మునిగిపోతున్న నౌకగా అభివర్ణించాల్సిందిగా తాము తమ న్యాయవాదికి నిర్దేశించలేదని వాప్కోస్ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ తో వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన అవినీతి స్కాముల నేపథ్యంలో ‘వసూలు కాని బకాయిల’ వివరాలను బ్యాలెన్స్ షీట్లలో పూర్తిగా చూపించనప్పటికీ, సంస్థ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు అధికారి మాట్లాడుతూ.. గడిచిన కొద్ది సంవత్సరా ల్లో వాప్కోస్ నిబంధనలకు విరుద్ధంగా, కేవలం కొందరికి లబ్ధి చేకూర్చేలా అనేక ఉద్యోగ నియామకాలు జరిగాయి. సంస్థను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగానే కాంట్రాక్ట్ పోస్టులను హేతుబద్ధీకరించడం (రెగ్యులరైజేషన్) జరుగుతోంది. ఇది మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే సాగుతోంది. అయితే దీనిపై కొందరు సిబ్బంది కోర్టును ఆశ్రయించారని ఆయన వివరించారు.
సింగరేణి డీపీఆర్ కూడా..
సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటి సారిగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 500 మెగావాట్ల సామర్థ్యం, రూ. 3,000 కోట్లతో రామగుండం. ప్రాంతంలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతలను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. నిజానికి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ విషయంలో అనుభవం ఉన్న సంస్థకు డీపీఆర్ బాధ్యతలు అప్పజెప్పాలి. కానీ ఈ రంగంలో అనుభవం లేని వ్యాప్కో సంస్థకు రూ.. 7 కోట్లకు డీపీఆర్ తయారీ బాధ్యతలను అప్పజెప్పడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ఇతర బరాజ్‌లలో తలెత్తిన సమస్యలకు వ్యాప్కోస్ ఇచ్చిన డీపీఆరే కారణమని నిపుణులు అంటున్నారు.
సింగరేణి పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు డీపీఆర్ కూడా వ్యాప్కోస్‌కు అప్పజెప్పడంపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతల నుంచి వ్యాప్కోస్‌ను తప్పించి, అనుభవం ఉన్న సంస్థలకు అప్పగించాలని స్పష్టం చేస్తున్నారు.
మన దగ్గరా వ్యాప్కోస్ నీడలు
దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో 40 మందికిపైగా ఇంజనీర్లు, అధికారులను బాధ్యులుగా తేల్చారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ (జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్) విచారణకు అప్పటి సీఎం కేసీఆర్‌ను సైతం పిలవడం తెలిసిందే. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అధికారులు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టు సంస్థలు..
ఇలా కాళేశ్వరం నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి తప్పులను లేవనెత్తి చూపుతూ.. వారందరిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ (డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఇచ్చిన సంస్థ వ్యాప్కోస్ కావడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం నుంచి వచ్చిన కాంట్రాక్టు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎక్కెడెక్కడ కట్టాలి.
ఎలా కట్టాలి లాంటి వివరాలతోపాటు పంప్‌హౌజ్‌లు, వాటి నిర్మాణం, కాలువలు, టన్నెల్లు లాంటి పూర్తి స్థాయి సర్వే, ప్రాథమిక నిర్మాణ డిజైన్లు తదితర అన్ని అంశాలతో ఇచ్చిన డీపీఆర్.. కాళేశ్వరానికి పునాది రాయి. అలాంటి డీపీఆర్ ప్రకారమే నిర్మించిన కాళేశ్వరం కుంగడం వెనుక వ్యాప్కోస్ సంస్థకూ బాధ్యత ఉం టుందని నిపుణులు చెబుతున్నారు.






