19 July, 2026 | 3:52 AM

ఆత్మ బంధువు అందెశ్రీ

19-07-2026 01:42 AM
  1. అందెశ్రీ, గద్దర్‌ను కేసీఆర్ అవమానించాడు.. 
  2. గజ్వేల్‌లో కేసీఆర్‌ను సమాధి చేసేది యువకులే
  3.    2034 వరకు మాదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి 
  4. ఉద్యమానికి ఊపిరి పోసిన అందెశ్రీ 
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  6. ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన

మేడ్చల్/ఘట్కేసర్, జూలై 18 (విజయక్రాంతి): తన ఆత్మ బంధువు ప్రజాకవి అందెశ్రీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను సమాధి చేసేది యువకులే అని, -అందెశ్రీని, గద్దర్‌ను అవమానించినప్పుడే శాశ్వతంగా ఫామ్‌హౌస్‌లోనే బంధీ చేసేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త తల్లిదండ్రుల సాక్షిగా 70 వేల ఉద్యోగాలిచ్చామని స్పష్టం చేశారు. 2034 వరకు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

శనివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ప్రజాకవి అందెశ్రీ స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన చేశా రు. ఎకరం 22 గుంటల స్థలంలో రూ. 3.95 కోట్ల తన వ్యయంతో స్మృతి వనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నాయని.. బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కల్లా అని, గతంగానే మిగిలిపోతుంది అని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు.

అందెశ్రీ, గద్దర్‌ను అవమానించినప్పుడే కేసీఆర్‌ను శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, నిరంకుశంగా పాలించారని కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాస్‌పోర్టు బ్రోకర్‌ను తెలంగాణ ప్రజలు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చేశారని, అమెరికాలో బాత్రూంలో కడిగిన వ్యక్తిని, రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తిని మంత్రులు చేశారని, గ్లాసులో సోడా పోసిన పోసిన వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా చేశారని ఎద్దేవా చేశారు.

నిజామాబాదులో ప్రజలు ఓడించిన కవితకు, కరీంనగర్‌లో ఓడించిన వినోద్‌రావుకు వెంటనే పదవులు ఇచ్చారని, తెలంగాణ యువతకు మాత్రం పదవులు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని, వారి మాటలు నమ్మవద్దని యువకులను కోరారు. 

బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రానివ్వ..

మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి రానిచ్చేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తులసివనంలో గంజాయి మొక్కలను పెరగనిచ్చేది లేదని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరులకు చోటు లేదని ఉన్నారు. నువ్వెంత? నీ జాతి ఎంత? ప్రజా పాలనపై శాపనార్థాలు పెడతావా అని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాలు, కేటీఆర్‌కు జన్‌వాడలో 100 ఎకరాలు, హరీశ్‌రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, శంకరపల్లిలో కవితకు 25 ఎకరాలు ఫామ్ హౌస్‌లు ఉన్నాయని ఇవి ఎప్పటి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ గతాన్ని భావితరాలకు పాఠంగా తెలియజేస్తామని సీఎం స్పష్టం చేశారు.

దొరల గడీల ముందు నిలబడని కవి అందెశ్రీ..

దొరల గడీల ముందు ఏనాడు నిలబడని కవి అందెశ్రీ అని రేవంత్‌రెడ్డి అన్నారు. అందెశ్రీ నాకు ఆత్మబంధువు, పెద్దన్న, నాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అందెశ్రీ పాటలను పదాలను నిర్మూలించాలని చూసిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రాసిన జయహే జయహే గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి కవులను కళాకారులను గౌరవించుకున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కొవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, బీర్ల ఐలయ్య, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, కలెక్టర్ మన చౌదరి పాల్గొన్నారు.

బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు: మంత్రి అడ్లూరి

సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ జ్ఞాపకార్థం స్మృతి వనం నిర్మించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మన సంస్కృతిని సాహిత్యాన్ని అందించవచ్చునని చెప్పారు. తెలంగాణ సాహిత్య రంగానికి అందెశ్రీ చేసిన సేవలను ఆయన కొనియాడారు.

ఉద్యమానికి ఊపిరి పోసిన అందెశ్రీ: భట్టి 

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా హృదయాలను తన కలంతో, గళంతో కదిలించిన అక్షర యోధుడు అందెశ్రీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముక్కోటి తెలంగాణ ప్రజల గొంతుకను ఒక్కటి చేసి, ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్రాన్ని భావోద్వేగాల మేలుకొలుపుగా మార్చిన మహోన్నత కవి ఆయన అని కొనియాడారు.

అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన సాహిత్యం, తెలంగాణ గడ్డపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన కలం నుండి జాలువారిన అద్భుత కవితా సంకలనం ’నిప్పుల వాగు’ పుస్తకాలను సుమారు 20,000 ప్రతులను ప్రభుత్వ పరంగా ముద్రించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ కీర్తిని చాటిన ఆయనకు దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ’పద్మశ్రీ’ అవార్డు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారికంగా సిఫార్సు చేశామని వెల్లడించారు. ఇక్కడ నిర్మించబోయే స్మృతివనం కేవలం ఒక కట్టడం కాదు, ఇది రాబోయే తరాలకు తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, అందెశ్రీ సాహిత్య వైభవాన్ని చాటిచెప్పే ఒక చారిత్రాత్మక కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.