19 July, 2026 | 3:37 AM

ఎల్ నినోను ఎదుర్కొంటాం

19-07-2026 01:07 AM
  1. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగనీయం 
  2. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంనేదుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.  ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, దీని వల్ల రైతులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

శనివారం హైదరాబాద్‌లోని అవాసా హోటల్‌లో ‘సింపోజియం’ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు అంశంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ఎల్ నినో వల్ల తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంన్నారు.

గతంలో నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ముందస్తు నీటి నిర్వహణపై దృష్టి వర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్ టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

భూగర్భ జలాలు పడిపోతున్నాయి

వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నీరే పునాది నీటిని కేవలం పంపిణీ చేసే వనరుగా కాకుండా, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చూడాలన్నారు. 

హైదరాబాద్‌కు దీర్ఘకాలిక తాగునీటి భద్రత హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి తాగునీటిని అందించే దీర్ఘకాలిక ప్రణాళికలను గత ప్రభుత్వాలు అమలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వర్షపు నీటిని భూగర్భంలోకి చేరేలా భారీ స్థాయిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను  ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.

పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీటీకరణ వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ తగ్గిపోవడంతో వర్షపు నీటి సంరక్షణ అత్యవసరమైందన్నారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, సహజ కాలువలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన ఆక్రమణల వల్ల నగరంలో వరద ముప్పు పెరిగిందని, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, సహజ డ్రైనేజీ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.