8 April, 2026 | 2:41 AM

జంక్షన్ల అభివృద్ధికి సహకరించండి

08-04-2026 12:57 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలో అంబేద్కర్, రాంనగర్, గోకుల్ నగర్, వడ్డేపల్లి చర్చి ప్రాంతాల్లోని జంక్షన్ లను అభివృద్ధిపరిచేందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

గోకుల్ నగర్ జంక్షన్ లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల ప్రజల రవాణాకు అంతరాయం ఏర్పడుతుందని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హనుమకొండ బస్టాండ్ నుండి వడ్డేపల్లి చర్చి వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలకు సంబంధించిన ప్రజలు జంక్షన్ల అభివృద్ధిలో సహకరించాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సహకరించి రోడ్డు వెడల్పు పనులకు ఆటం కం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధికి సుమారు 26 కోట్ల రూపాయల నిధులు మంజూరై ఉన్నాయని, ప్రజలు సహకరిస్తే అంబేద్కర్ జంక్షన్ నుండి వడ్డేపల్లి చర్చి జంక్షన్ వరకు రోడ్డును సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సుందరంగా తయారు చేసేందుకు, ఇరువైపులా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులను ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు బంక సతీష్ యాదవ్, పల్లకొండ సతీష్, ఎర్ర మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

వరద ప్రభావంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అండ గా నిలిచారు. టీవీ టవర్ కాలనీలో నివసిం చే బాధిత కుటుంబాన్ని ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన వరదలో పాక శ్రీనివాస్  ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందగా, విషా ద ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లి, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించగా, ఆ  చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.