8 August, 2026 | 2:59 PM

సవాళ్లే అవకాశాలు.. నేర్చుకునేవారే విజయం సాధిస్తారు!

08-08-2026 01:46 PM
  1. ఐఐటీలో కొత్త ఏఐ ఆవిష్కరణలు.
  2. జీవిత పరీక్షలో సిలబస్.. బయట పోటీ.
  3. IIT ఢిల్లీ స్నాతకోత్సవంలో పాల్గొనడం సంతోషం.
  4. పట్టభద్రులవుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు.

న్యూఢిల్లీ: ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయని, నేర్చుకున్నవారే విజయం సాధిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology), ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ, కొత్త పరిష్కారాలను కనుగొనే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయని ప్రధాన మంత్రి తెలిపారు. ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుమేట్ల పట్ల గర్వంగా ఉందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తదుపరి కార్యాచరణకు సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు.

మరింతగా మహిళా గ్రాడ్యుయేట్లు(Women graduates) రావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. పతకాలు స్వీకరించినవారిలో మరింత మంది మహిళలుంటే బాగుండేదన్నారు. ఐఐటీలో కొత్త ఏఐ ఆవిష్కరణలు రూపొందుతున్నాయని తెలిపారు. మార్పు అనేది సవాళ్లు, అవకాశాలతో కూడుకుని ఉంటుందని వివరించారు. జీవిత పరీక్షలో సిలబస్ బయట ప్రపంచంలో పోటీ ఉంటుందన్నారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగలరని మీ పట్టా సూచిస్తుందన్నారు.

సవాళ్లే అవకాశాలుగా మారుతాయని ప్రధాని స్పష్టం చేశారు. ఇక్కడ నేర్చుకున్న అంశాల అమలుకు కృషి చేయాలని కోరారు. నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. నిరంతరం నేర్చుకునే వ్యక్తి విజేతగా ఉంటాడు, సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం ఉండాలన్నారు. వికసిత్ భారత్ కోసం విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువ శక్తి.. దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. జీవితంలో ఎప్పుడూ కుతూహలం కలిగి ఉండాలని విద్యార్థులకు పీఎం సూచించారు.