8 August, 2026 | 4:01 PM

జూరాలకు వరద.. ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్

08-08-2026 02:51 PM

జూలై 27 నుంచే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌కు పంపింగ్

ఇప్పటివరకు 5.4 టీఎంసీల నీటి ఎత్తిపోతలు

వరి సాగుకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలి: సీఈ రహీముద్దీన్

వనపర్తి,(విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైన వెంటనే జూలై 27 నుంచి జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ ప్రారంభించినట్లు వనపర్తి చీఫ్ ఇంజినీర్ మొహమ్మద్ రహీముద్దీన్  తెలిపారు. జూరాల ప్రధాన కాలువలకు జూలై 29న నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వరద ప్రవాహం కొనసాగినంతకాలం ఎటువంటి ఆటంకం లేకుండా నీటి విడుదల, పంపింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు కలిపి 5.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్లు వెల్లడించారు.

 నెట్టెంపాడులో నిల్వ సామర్థ్యంతోనే పంపింగ్

నెట్టెంపాడు ప్రాజెక్టులో నాలుగు పంపులు ఉండగా ఒక్కో పంపు 750 క్యూసెక్కుల సామర్థ్యంతో మొత్తం 3,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చని సీఈ తెలిపారు. అయితే రేలంపాడు రిజర్వాయర్‌లో లీకేజీ సమస్య కారణంగా సుమారు 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని, గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం కూడా సుమారు 1 టీఎంసీ మాత్రమేనని వివరించారు.ఈ కారణంగా గత ఐదేళ్లుగా రెండు పంపులను మాత్రమే నడుపుతున్నామని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ, విడుదలను బట్టి ఒక పంపును నడుపుతున్నట్లు తెలిపారు.

 భీమా ప్రాజెక్టులోనూ నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా

భీమా ప్రాజెక్టు స్టేజ్‌-2లో తిరుమలయపల్లి వద్ద మూడు పంపులు ఉన్నాయని, ఒక్కోటి 750 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. ఇందులో రెండు పంపులు వినియోగానికి, ఒకటి స్టాండ్‌బైగా ఉన్నాయని, రెండు పంపుల ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చన్నారు.

అయితే శంకసముద్రం రిజర్వాయర్ పూర్తికాకపోవడం, ఏనుకుంట రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 0.1 టీఎంసీగా ఉండటంతో మొదటి నుంచీ ఒక పంపును మాత్రమే నడుపుతున్నట్లు వివరించారు. భీమా స్టేజ్‌-2 కొత్తకోట వద్ద 318 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మూడు పంపులు ఉండగా, ఒకటి స్టాండ్‌బైగా, రెండు వినియోగంలో ఉన్నాయని తెలిపారు.

 వరి వద్దు.. ఆరుతడి పంటలే మేలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సీఈ రహీముద్దీన్ సూచించారు. రాబోయే రోజుల్లో జూరాలకు వచ్చే వరద ప్రవాహంపై నీటి విడుదల ఆధారపడి ఉంటుందని తెలిపారు.

 నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: మొహమ్మద్ రహీముద్దీన్, చీఫ్ ఇంజినీర్, వనపర్తి 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెరువుల నింపడం, తాగునీటి అవసరాల కోసం నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు.