12 July, 2026 | 1:57 PM

గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

12-07-2026 01:19 PM

న్యూఢిల్లీ: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సంతాపం వ్యక్తం చేశారు. వివిధ భాషలలో జానకి పాడిన పాటలు తరతరాలుగా ఆదరణ పొందాయని, సాటిలేని హుందాతనం, వైవిధ్యంతో ప్రతి భావనకూ అవి స్వరాన్ని అందించాయని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా జానకి శనివారం మైసూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకమ్మ మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అని చేసిన పోస్ట్‌లో తెలిపారు. ఆమె స్వరాలు రాబోయే కాలంలోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఓం శాంతి అని ఆయన అన్నారు.

తన వైవిధ్యానికి పేరుగాంచిన జానకి, ప్రధానంగా కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం వంటి అనేక భాషలలో 48,000కు పైగా పాటలను రికార్డ్ చేశారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, ఆమె హిందీ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, బెంగాలీతో సహా సుమారు 20 భారతీయ భాషలలో సినిమాలు, ఆల్బమ్‌లు, టెలివిజన్, రేడియో కార్యక్రమాలకు పాడారు.