స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): సోషల్ మీడియా నేటి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని,కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు సాధారణ విషయాలుగా మారినప్పటికీ, వాటి వెనుక ప్రమాదకరమైన ఉచ్చులు కూడా దాగి ఉన్నాయి. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల.శ్రీనివాస్ రావణ్ మాట్లాడుతూ... ఇటీవలి కాలంలో కొందరు నకిలీ పేర్లతో, నకిలీ ఖాతాలతో సోషల్ మీడియాలో ప్రవేశించి, ముఖ్యంగా యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ,స్నేహం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
మొదట సాధారణ "హాయ్", "హలో"సందేశాలతో ప్రారంభమయ్యే పరిచయాలు, తర్వాత వ్యక్తిగత చాటింగ్‌కు దారి తీస్తాయని, బాధితుల నమ్మకాన్ని సంపాదించిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు లేదా ఇతర భావోద్వేగ కథలు చెప్పి డబ్బు దోచుకోవడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, సమాచారం సేకరించి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యక్తి నిజమైనవారేనని భావించడం ప్రమాదకరమని, ఆకర్షణీయమైన ప్రొఫైల్ ఫోటోలు,పోస్టులు లేదా మధురమైన మాటలను చూసి వెంటనే నమ్మరాదని హెచ్చరించారు.
ఎప్పుడూ కలవని అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, అత్యంత సన్నిహితంగా మెలగడం తీవ్రమైన పరిణామాలకు దారి తీసే అవకాశముందని తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగల్చవచ్చని అన్నారు.
యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు లేదా సందేశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అలాగే తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి,ఉన్నత భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ యాప్స్ ను వెంటనే నిషేదించాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.






