27 August, 2026 | 6:57 PM

ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన

12-07-2026 01:49 PM

తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈసం నరసింహారావు విజ్ఞప్తి

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈసం నరసింహారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదివాసుల రిజర్వేషన్ల దోపిడీ, ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న భూకబ్జాలు, గిరిజన చట్టాలు, హక్కులు సక్రమంగా అమలు కాకపోవడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు జీవో నెం.3 పరిధిలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు పీసా చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని అరికట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వైద్య సదుపాయాల కొరతతో గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని వివరిస్తూ ప్రత్యేక వైద్య సేవలు కల్పించాలని కోరారు. ఆదివాసుల భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన ముఖ్యమంత్రి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఈసం నరసింహారావు తెలిపారు.