ఆయనో చంచల స్వభావి

01-05-2024 12:10:00 AM

శరద్ పవార్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ఓ పెద్ద మనిషి వ్యవసాయ మంత్రిగా పనిచేశారు

అప్పట్లో రైతులకు ఏమీ చేయలేదు.. 

ఆయన స్వార్థం కోసం మహారాష్ట్రను అస్థిరపరిచారు0

అందుకే ఏ ఒక్క సీఎం పూర్తి కాలం పనిచేయలేదు

కాంగ్రెస్‌కు ఓటేసి మీ ఓటును వృథా చేసుకోవద్దు

రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదన్న మోదీ

సోలాపూర్ (మహారాష్ట్ర), ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్రమోదీ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్‌పై విమర్శలు పర్వం కొనసాగిస్తున్నారు. చంచల స్వభావి అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. మంగళవారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మల్షిరాస్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ‘ఓ పెద్ద మనిషి ఒకప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బకాయిల కోసం రైతులు చెరుకు కమిషన్ చుట్టూ  కాళ్లరిగేలా తిరిగేవారు’ అంటూ శరద్ పవార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రలో ఓ చంచల స్వభావి ఉన్నారు. 45 ఏళ్ల కింద ఆ నాయకుడు ఈ ఆటను మొదలుపెట్టారు. ఆయన సొంత లబ్ధి కోసం మహారాష్ట్రలో ఎప్పుడూ అస్థిరత ఉండేలా చూసేవారు. దీనివల్ల ఎప్పుడూ ఏ ఒక్క సీఎం కూడా పూర్తి కాలం పనిచేయలేదు’ అటూ విమర్శలు చేశారు.

రిజర్వేషన్లు పాప పరిహారం..

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమంటే గతంలో పూర్వీకులు చేసిన పాపా లకు ప్రాయశ్చితమే అన్నారు. ‘గత పదేళ్లలో మా పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ఎప్పుడు కూడా రిజర్వేషన్లు తొలగించాలనే ఆలోచన చేయలేదు. రిజర్వేషన్లు కొనసాగించేందుకు నేను కట్టుబడి ఉన్నాను’ అని వివరించారు.

మీ ఓటు వృథా చేసుకోకండి..

విపక్షాలు, కాంగ్రెస్‌కు ఓటేసి ఓటును వృథా చేసుకోవద్దని ఓటర్లకు ప్రధాని మోదీ సూచించారు. ‘లోక్‌సభలో అవసరమైన కనీస మెజారిటీ స్థానాల్లో కూడా పోటీ చేయని పార్టీకి ఎందుకు ఓటేయాలి? మీ ఓటును వారికి వేసి వృథా చేసుకోకండి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే వర్తమానంతో పాటు భవిష్యత్తుపై కూడా దృష్టి సారిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనకు, మోదీ 10 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి ఎన్నికలకు ముందు పేదరిక నిర్మూలన గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తుందని, కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని గురించి ఎప్పుడూ కృషి  చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కానీ తమ ప్రభుత్వంలో పదేళ్లలోనే ఏకంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయపడేశామని, 80 కోట్ల మంది ఉచితంగా రేషన్ పొందుతున్నారని గుర్తుచేశారు.