లౌకిక స్వభావాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర

01-05-2024 12:03:05 AM

కుట్రలను తిప్పికొట్టేందుకే ఇండియా కూటమికి మా మద్దతు

ముస్లింల మెజార్టీ ఉన్న ప్రాంతాలపై కేంద్రం శీతకన్ను  

జమ్మూకాశ్మీర్ నేషనల్  కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: భారత్‌కు ఉన్న గొప్ప లౌకిక స్వభావాన్ని దెబ్బతీసి నియంతృత్వ పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆ కుట్రలను తొప్పికొట్టేందుకే ఇండియా కూటమితో జత కట్టిందని పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. శ్రీనగర్ ఎంపీ అభ్యర్థి అగా సయ్యద్ రుహుల్లా మెహదీ గెలుపు కోసం సోమవారం సెంట్రల్ షెల్టాంగ్, ఈద్గాహ్ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

భారతీయ సమగ్రత, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకే అనేక ప్రజాస్వామిక పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై శీతకన్ను వేసిందని ఆరోపించారు. శ్రీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబాటే అందుకు చక్కటి ఉదాహరణ అన్నారు. ఈ ప్రాంతం తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ 2019 ఎన్నికల సమయంలో  శ్రీనగర్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చిందని, 2024 ఎన్నికలు వచ్చినా ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.