ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్.. భారత్-పాక్ కాల్పుల విరమణపై క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో(PM Modi -Donald Trump) దాదాపు 35 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Foreign Secretary Vikram Misri) తెలిపారు. జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇద్దరు నాయకులు సమావేశం కావాల్సి ఉందని, అయితే అధ్యక్షుడు ట్రంప్ కెనడాలో జరిగే శిఖరాగ్ర సమావేశం నుండి ముందుగానే వెళ్లిపోవడంతో సమావేశం జరగలేదని మిస్రి అన్నారు. "పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అధ్యక్షుడు ట్రంప్(President Donald Trump) ప్రధాని మోదీతో ఒకసారి మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరిగిన తొలి సంభాషణ నేటి కాల్" అని మిస్రి అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తో భోజన సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ ఫోన్ కాల్ వచ్చింది.
అంతకుముందు, పహల్గామ్ ఉగ్రవాద దాడిని(Pahalgam terrorist attack) ఖండించిన ప్రపంచ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం వైఖరిని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన 51వ జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన ఔట్రీచ్ సెషన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ చర్యను వేగవంతం చేయాలని నాయకులను కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ కొండ ప్రాంతంలో 26 మందిని, ఎక్కువగా పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, గత నెలలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడులు, ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత మోడీ హాజరైన మొదటి బహుపాక్షిక కార్యక్రమం జీ-7 శిఖరాగ్ర సమావేశం.
ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్ కు వివరించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించారని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి వాణిజ్యానికి సంబంధించిన ఎటువంటి అంశాలు చర్చించబడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని మిస్రి అన్నారు. భారతదేశం ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, భవిష్యత్తులో అలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని కూడా ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, భారతదేశం ఇప్పుడు ఉగ్రవాద చర్యలను ప్రాక్సీ చర్యలుగా కాకుండా యుద్ధ చర్యలుగా పరిగణిస్తుందని ప్రధాని మోదీ నొక్కిచెప్పారని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ట్రంప్ తో సుమారు 35 నిమిషాల పాటు జరిగిన ఫోన్ కాల్ లో ప్రధాని మోదీ కాల్పుల విరమణ ఒప్పందంలో మీ పాత్రే లేదని చెప్పారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఎవరి జోక్యం అవసరం లేదని ట్రంప్ కు మోదీ తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు ఎవరి జోక్యం లేదు.. దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నాలుగు రోజుల సైనిక చర్యల తర్వాత భారతదేశం-పాకిస్తాన్(India-Pakistan) కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ పదే పదే ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ టముకు వేసిన విషయం తెలిసిందే. అయితే, భారతదేశం ట్రంప్ వాదనను ఖండించింది. భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య చర్చల తర్వాత రెండు దేశాల 'అవగాహన' కుదిరిందని పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ తన ప్రస్తుత అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవమని ఆహ్వానించారు. కానీ ముందుగా ఉన్న షెడ్యూల్ కారణంగా, ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు. సమీప భవిష్యత్తులో కలుసుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారని మిస్రి చెప్పారు.






