కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం బేగంపేటకు చేరుకోనున్న ప్రధాని మోదీ, బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి వెళ్లనున్నారు. తెలంగాణలో రూ.9,377 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో కలిసి వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే వరంగల్ లో పీఎం మిత్ర పార్కును ప్రారంభించి, జహీరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతానికి, నాలుగు వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
గుడెబెల్లూర్-మహబూబ్ నగర్ మధ్య 165 కిలోమీటరు మేర రహదారి నిర్మాణం, ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ మల్కాపూర్ లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ పై సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి గుజరాత్ బయల్డేరి వెళ్లనున్నారు.
హైదరాబాద్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. బేగంపేట విమానాశ్రయం ఎస్పీజీ వలయంలో ఉన్నట్లు సమాచారం. దీంతో పాసులు ఉన్నవారినే పోలీసులు విమానాశ్రయానికి అనుమతిస్తున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలతో పాటు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బండారు దత్తాత్రేయ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.






