17-02-2026 01:13:14 AM
నలుగురు అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పెంచికలపేట, ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): ఎల్లూరు చెరువు వద్ద వలస పక్షులపై విషప్రయోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న చెరువు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు విషప్రయోగం చేసి పక్షులను హతమార్చి తీసుకెళ్తున్నారన్న పక్కా సమాచారంతో ఫారెస్ట్ బీట్ అధికారి సతీష్, డ్రైవర్ వాజీద్ రెడ్ హ్యండెడ్‌గా నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా 26 చనిపోయిన పక్షులు లభ్యమయ్యాయి. వీటిలో 19 నార్తర్న్ పింటెయిల్స్ (విదేశీ వలస పక్షులు), 7 గ్రే-హెడెడ్ స్వాంఫెన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారు ప్రకాశ్ సర్కార్, కుశాల్ మండల్, తుషార్ డే, తరఫ్దార్ సంజిత్లుగా గుర్తించారు. వీరంతా కూలీ పనులు చేసే వారు కాగా, కాగజ్‌నగర్ మండలం పరిధిలోని నజ్రుల్నగర్, రాంనగర్ ప్రాంతాలకు చెందినవారని విచారణలో తేలింది. వీరు లోడుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల నిమిత్తం వచ్చి, ఈ నెల 13న పంట పొలాల్లో ఉపయోగించే క్రిమిసంహారక మందును వడ్ల గింజల్లో కలిపి చెరువులోని తామర ఆకులపై ఉంచినట్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం చనిపోయిన పక్షులను తీసుకెళ్లే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన పక్షులకు వెటర్నరీ సర్జన్ల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తులో ఫారెస్ట్ బీట్ అధికారులు డి. సంగదీప్, ఆర్. లచ్చన్న, టి. మనోహర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి జి. జగన్మోహన్ గౌడ్, అనిమల్ ట్రాకర్ రాజు పాల్గొన్నారు.