రైతులపై ప్రయోగమా?
- విడుదల కాని వరి వంగడాల సాగుకు సర్కారు సై
- మార్కెట్‌లోకి రాని కేఎన్‌ఎం 7715
- నాటాలంటూ ప్రభుత్వం రూల్
- ఈవానాకాలం ఏడు రకాల సన్నాలకే బోనస్
- రెండు ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికేనా?
- సర్కార్ సరికొత్త మెలికపై అనుమానాలు
- ఆంక్షలపై అన్నదాత ఆగ్రహం
మేడ్చల్, జూన్ 23 (విజయక్రాంతి): ఏడు రకాల వడ్లకే బోనస్ ఇవ్వాలన్న సర్కారు నిర్ణయం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన ఏడు రకాల్లో రెండు ప్రైవేటు కంపెనీలకు చెందినవి ఉండడంతో.. వాటికి లబ్ధి చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. అంతేగాక మరొక రకం ఇంతవరకు మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల కాలేదు. కానీ, ఆ విత్తనాన్ని నాటాలని ప్రభుత్వం సూచించడం విస్మయం కలిగిస్తోంది.
పరిశోధనలకే పరిమితమైన వంగడా లను నాటాలనడం రైతులపై ప్రయోగం చేయడమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవు తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు లు బోనస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ, కేవలం సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సర్కారు మెలిక పెట్టింది. బోనస్ వస్తుందన్న ఆశతో రైతులు సన్న రకాలు సాగు చేశారు. అయితే, ప్రభుత్వం ఈ వానాకాలం సరికొత్త మెలికలు పెట్టింది. గతంలో 33 రకాలకు బోనస్ చెల్లించగా, ఈసారి అందులో నుంచి 26 రకాలను తొలగించింది. కేవలం 7 రకాలకు మాత్రమే చెల్లిస్తామని, ఆ రకాలను ప్రకటించింది.
రెండు ప్రైవేట్ కంపెనీలు మహారాష్ట్రకు చెందినవి..
రెండు ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకే బోనస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీపీటీ 5204 (సాంబ మసూరి), ఆర్‌ఎన్‌ఆర్ 15048(తెలంగాణ సోనా), హెచ్‌ఎంటి సోనా, జైశ్రీరామ్, కేఎన్‌ఎం 1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్ 44(సిద్ధి), కేఎన్‌ఎం 7715 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది.
ఇందులో 5 రకాలు ప్రభుత్వానికి చెందినవి కాగా, రెండు రకాలు మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు కంపెనీలవి. ప్రభుత్వ విత్తనాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో కార ణంతో సాగు చేయడానికి రైతులు ఇష్టపడరు. అయినప్పటికీ ఆ రెండు కంపెనీలకు చెందిన విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బీపీటీ 5204 (సాంబ మసూరి) 150 రోజుల పంట. దీనికి మే 15వ తేదీ లోపే నారు పోయాల్సి ఉంటుంది.
ఈ రకాన్ని తెలంగాణలో ఎక్కువగా సాగు చేయరు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్‌లో మూడు నాలుగు మండలాల్లో మాత్రమే సాగు చేస్తారు. ఇక ఆర్‌ఎన్‌ఆర్ 15048(తెలంగాణ సోనా) రకం తినడానికి బాగుంటుంది. డయాబెటిక్ రోగులు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ, సాగుపరంగా వర్షంలో పండదు. ఆగస్టులో నాటుకోవలసి ఉంటుంది. కాటుక తెగులు ఎక్కువగా సోకుతుంది.
ప్రయోగశాల నుంచి పొలంలోకి..
ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల్లో కేఎన్‌ఎం 7715 ఒకటి. దీన్ని కూనారం వరి పరిశో ధన కేంద్రంలో రూపొందించారు. ఈ రకానికి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ, వీటిని వ్యవసాయ శాఖ అధికారికంగా మార్కెట్ లోకి విడుదల కాలేదు. అధికారికంగా విడుదల కానందున విత్తనాలు విక్రయించడానికి వీల్లేదు. ఒక విత్తనం అధికారికంగా విడుదల కావాలంటే చిరు సంచుల పథకం కింద రైతులు మూడేళ్లు ప్రయోగాత్మకంగా పండించాలి.
ఈ మూడేళ్లలో దిగుబడి, నాణ్యత, తెగుళ్లను తట్టుకోవడం తదితర సమాచారం సేకరిస్తారు. మంచి ఫలితాలు కనబడితే ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది. వెరైటీ రిలీజ్ కమిటీ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ రకం రిలీజ్ కమిటీకి ప్రపోజ్ చేశారు. కానీ ఇంకా నిర్ణయం వెలువడ లేదు. సీడ్ సర్టిఫై ఏజెన్సీ కూడా సర్టిఫై చేయాలి. అప్పుడే విత్తనాలు విక్రయించడానికి వీలవుతుంది.
ఇప్పటికే నార్లు పోసిన రైతులు
ఏడు రకాలకే బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటన పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకోగా, మరికొందరు బోరుబావుల కింద నారు పోసుకు న్నా రు. నారు పోసుకున్న రైతులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సన్న రకాల సాగుకు ఆంక్షలు పెట్టడం ఏమిటని అంటున్నారు.
ప్రైవేటు విత్తన కంపెనీలకు శరాఘాతం
ప్రభుత్వ నిర్ణయం ప్రైవేటు విత్తన కంపెనీలకు శరాఘాతమైంది. అన్ని కంపెనీలు వానాకాలం పంటకు విత్తనాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా ఏడు రకాల కే బోనస్ అని ప్రకటించడంతో తమ పరిస్థితి ఏమిటని? కంపెనీల యజమానులు వాపోతున్నారు. ఒక ఏడాది ముందుగా ప్రకటిస్తే కంపెనీలు విత్తనాల ఉత్పత్తి బందు చేస్తాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతులు, ప్రైవేట్ విత్తన కంపెనీల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు వచ్చే సంవత్సరం నుంచి పెడితే బాగుంటుందని అంటున్నారు.






