24 June, 2026 | 1:04 AM

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి

24-06-2026 12:13 AM
  1. నిలిచిపోయిన బస్సు సౌకర్యం 
  2. ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి అష్ట కష్టాలు
  3. ప్రయాణికులకు తప్పని తిప్పలు
  4. రహదారిపై ప్రయాణం నరకప్రాయం

మానకొండూరు, జూన్ 23 (విజయక్రాంతి)కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రంగపేట ఎక్స్ రోడ్డు నుండి కెల్లేడు, మద్దికుంట రోడ్డు నరకానికి నకలుగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది ఏళ్లకు పైగా రోడ్డుకు మరమ్మత్తులు కరువై, తారు లేచిపోయి, గుంతలు పడి రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. రహదారిపై ఏర్పడ్డ గుంతలు వాహన చోదకుల నడ్డి విరుస్తున్నాయి. ద్వి, త్రి చక్ర వాహనాల ఇంజన్ తదితర విడి బా గాలు దెబ్బతిని మరమ్మతులకు వాహన యజమానుల జేబులు గుల్లవుతున్నాయి.

రోడ్డు అధ్వాన్న స్థితికి చేరడంతో, గ్రామానికి ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. గత రెండు సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పిస్తే మద్దికుంట, దేవంపల్లి, కెల్లేడు గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడం, రోడ్డు కిరువైపులా చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి, రోడ్డును కమ్మి వేస్తున్నాయని ఆర్టీసీ అధికారులు తెలపడంతో కెల్లేడు సర్పంచ్ ఆడెపు రజిత విజయ్ రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంతోపాటు, గుంతలలో మట్టి నింపి తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి చేసి రహదారిని బాగు చేశారు.

దీంతో కేవలం మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం చెంజర్ల, గంగిపల్లి, కొండపల్కల, మద్దికుంట, కెల్లేడు గ్రామాల విద్యార్థులకు పోచంపల్లి మోడల్ స్కూల్ మీదుగా కరీంనగర్ వరకు ఆర్టీసీ బస్సును రెండు ట్రిప్పులు నడిపిస్తున్నారు. పలు దఫాలుగా గ్రామ ప్రజలు చేసిన విజ్ఞప్తుల మేరకు అధికారులు బస్సు సౌకర్యం కల్పించినా, ప్రయాణికులకు, విద్యార్థులకు పూర్తి ప్రయోజనం అందడం లేదు. డిగ్రీ, బీటెక్, తదితర కోర్సుల, వృత్తి విద్య, విద్యార్థులకు, ప్రయాణికులకు తదితరులకు బస్సులు లేక కెల్లేడు నుండి రంగపేట ఎక్స్ రోడ్ వరకు వెళ్లే దుస్థితి దాపురించింది.

సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన లేదా తల్లిదండ్రులు, బంధువులు, గ్రామంలో ఎవరు ఒకరు వాహనాలపై రంగపేట ఎక్స్ రోడ్ వరకు దించి తిరిగి ప్రయాణంలో తీసుకు వెళ్ళటానికి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం, పనులు పక్కనపెట్టి గ్రామంలోనికి తీసుకొని రావాల్సి వస్తుందని గ్రామస్తులు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. లేదా మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని దీంతో శారీరక శ్రమ, కాలయాపన తో ,సకాలంలో కళాశాలలకు చేరు కోలేకపోతున్నామని, ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు నిర్మాణానికి పాలకులు, అధికారులు సహకరించి, రహదారిని బాగు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించి ప్రజల ఇక్కట్లను తొలగించాలని కెల్లేడు, మద్దికుంట, దేవంపల్లి గ్రామాల ప్రజలు పాలకులను, అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు.