24 June, 2026 | 2:25 AM

రేవంత్.. జాబ్ క్యాలెండర్ ఎక్కడ?

24-06-2026 01:34 AM
  1. రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం 
  2. ప్రజావ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి 
  3. యువత ఉద్యోగాలను సృష్టించాలి
  4. జెన్-జీ కాన్‌క్లేవ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించా రు. ఉస్మానియా వర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి వెయ్యి రూపాయ లు కూడా ఇవ్వలేదన్నారు. ఏదని, కాంగ్రె స్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడంతోపాటు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత ముం దుకు రావాలని పిలుపునిచ్చారు.

రాబో యే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక బలమై న యువజన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి యువతకు విద్యా నైపుణ్యాలతో పాటు రాజకీయ చైతన్యం, అవగాహన కూడా ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో యువత హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణ విడుదల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో యువతకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం నిర్వహించిన నమో జెన్-జీ కాన్‌క్లేవ్‌లో రాంచందర్‌రావుతోపాటు ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మశేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. దేశ భక్తితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నేపాల్ తరహాలో జెన్ జీ బయటకు వచ్చి మన దేశంలో కూడా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓ నేత మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 

విద్యార్థులు చదువుతో పాటు రాజకీయాలపై అవగాహన ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ చదవాలనే ఒక ట్రెండ్ నడుస్తోందని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఇదే ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అయితే, విద్య అనేది కేవలం ఒక ఉద్యోగం కోసం మాత్రమే కాదని, కేవలం ప్రొఫెషనల్ కోర్సుల వెనుకే పరుగెత్తకుండా విద్యార్థులు తమకు నచ్చిన బీఏ, బీఎస్సీ, బీఈడ్, ఎమ్మెస్సీ వంటి సంప్రదాయ కోర్సులను కూడా ఎంచుకోవాలన్నారు.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆధారపడే పరిస్థితి మారాలని, యువతలో స్వయం ఉపాధి, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం పెరగాలని ఆకాంక్షించారు. గతంలో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు సుమారు 380 ఉంటే, నేడు మోదీ కృషితో 780కి పైగా పెరిగాయని గుర్తుచేశారు. గతంలో ఐఐటీల్లో చదివే విద్యార్థుల సంఖ్య కేవలం 65 వేలు ఉంటే, నేడు ఆ సంఖ్య 1.30 లక్షలకు పైగా పెరిగిందని, ట్రిపుల్ ఐటీల సంఖ్య కూడా భారీగా పెరిగిందని స్పష్టం చేశారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆర్థిక సహాయం అందిస్తోందని, తద్వారా నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా అణచివేశారని రాంచందర్‌రావు మండిపడ్డారు.

ఆనాడు ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడిన అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కే. అద్వానీతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది నాయకులను, ప్రజాస్వామ్యవాదులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో నిర్బంధించిందని మండిపడ్డారు. నాటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దేశంలో విభజన రాజకీయాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ.. నేడు ఏ మొహం పెట్టుకుని రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని ఆయన తీవ్రంగా నిలదీశారు. 

మొదట దేశం.. తర్వాతే పార్టీ: ఎంపీ ఈటల 

మొదట దేశమని, తర్వాతే పారటీ అనే నినాదంతో మోదీ పాలన సాగుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. ఈ 12 ఏండ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలను మోదీ తీసుకొచ్చారన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచానికి ధైర్యాన్ని ఇచ్చింది భారత దేశమే అన్నారు.