18 August, 2026 | 2:12 AM

మరో 2 రోజులు పోలీస్ కస్టడీ

18-08-2026 12:00 AM
  1. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్షియల్ టెస్ట్
  2. ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు

రంగారెడ్డి, అగస్టు 17 (విజయక్రాంతి): సహచర మహిళా ట్రెనీ ఐపీఎ స్‌పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్ ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యా యస్థానం, ఆయనను మరో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా విచారణలో భాగం గా ఉదయ్ కృష్ణారెడ్డికి ’పొటెన్షియల్ టెస్ట్’ (లైంగిక సామర్థ్య వైద్య పరీక్ష) నిర్వహించేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీ స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 30 ఏళ్ల మహి ళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక దాడులు, భౌతిక దాడి, అసభ్యకర మెసేజ్లు పంపడం, ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి బాధితురాలి భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీస్ అకాడమీ ప్రాథమిక విచారణ లో ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ ఆయనను ఇప్పటికే శిక్షణ నుంచి సస్పెండ్ చేసింది.  ప్రస్తుతం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.