చోరీల నివారణకు పోలీసుల నిఘా
- సామాన్యుల మాదిరి ఆరుబయట నిద్ర
- స్థానికుల భాగస్వామ్యంతో నేరాలు అదుపు
- సీసీ కెమెరాలు ఏర్పాటుకు సూచన
సిద్దిపేట క్రైం, మే 19 : వేసవిలో ఉక్కపోత కారణంగా రాత్రి ఆరుబయట, బాల్కనీల్లో పడుకునేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారిని పట్టుకోవడానికి సిద్దిపేట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ కోసం ఈ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు సామాన్య పౌరుల మాదిరిగా గ్రామాల్లో ఇళ్ల ముందు బయట పడుకుంటూ రాత్రంతా నిఘా ఉంచుతున్నారు. దౌల్తాబాద్ ఎస్‌ఐ అరుణ్ కుమార్ స్వయంగా స్థానిక గ్రామాలను సందర్శించి, రాత్రి వేళ ఒక గ్రామస్థుడి ఇంట్లో పడుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఆయన అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించడమే కాకుండా, గ్రామీణ ప్రజలలో బలమైన ధైర్యాన్ని నింపారు.
గొలుసు దొంగల ముఠా అరెస్ట్ - సొత్తు రికవరీ
సిద్దిపేట పోలీసులు ఇటీవల నమోదైన గొలుసు దొంగతనం కేసులను విజయవంతంగా ఛేదించి, ఒక ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా పొలాలు, వ్యవసాయ క్షేత్రాలు, బైపాస్ రోడ్ల ద్వారా గ్రామాల్లోకి ప్రవేశిస్తూ, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. అత్యాధునిక సాంకేతిక ఆధారాలు, స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించబడిన బంగారు ఆభరణాలను పోలీసులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్, యువత భాగస్వామ్యం
గ్రామాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడానికి సిద్దిపేట పోలీసులు స్థానికులను భాగస్వాములను చేశారు. పోలీసులతో కలిసి పనిచేయడానికి స్థానిక యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పోలీస్ సిబ్బంది, స్థానిక యువతతో కూడిన బృందాలు రాత్రి వేళల్లో చురుగ్గా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పంచుకోవడానికి, అనుమానాస్పద కదలికలను తక్షణమే నివేదించడానికి ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి చాటింపు వేయిస్తున్నారు. ప్రధాన కూడళ్లలోనే కాకుండా, అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నివాసితులను, కాలనీ లీడర్లను కోరుతూ ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
పోలీసులకు సహకరించాలి : సీపీ
ఎండకాలంలో నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రజలను కోరారు. రాత్రి వేళల్లో ఆరు బయట, బాల్కనీల్లో పడుకోవద్దని సూచించారు. పడుకోవడానికి ముందు, ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు, కాంపౌండ్ గేట్లకు తాళాలు సరిగ్గా వేశారా లేదా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని, ఇళ్ల వద్ద సోలార్ లైట్లను ఏర్పాటు చేసుకోవాలని, పెంపుడు కుక్కలను పెంచుకోవాలని సూచించారు.
ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే, తక్షణమే మీ పొరుగువారిని అప్రమత్తం చేయడం తోపాటు డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామం ప్రవేశ మార్గం వద్ద అలాగే ఒంటరిగా ఉండే నివాస ప్రాంతాల సమీపంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సీపీ ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని ఉపయోగించుకుని తమ పరిసరాలను నేర రహితంగా ఉంచడానికి పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.






