10 August, 2026 | 9:55 AM

పోలీసు సంక్షేమమే ప్రాధాన్యం

10-08-2026 08:49 AM

నేరాలపై ఉక్కుపాదం 

 మహిళల భద్రత, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి

డీజీపీ సీవీ ఆనంద్

భూపాలపల్లి, ఆగస్టు 09 (విజయక్రాంతి): పోలీసు సంక్షేమమే ప్రాధాన్యమని నేరాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని మహిళల భద్రత, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భూపాలపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పలు అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. .అనంతరం మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, కల్తీ ఆహారం, పోలీసు సిబ్బంది సంక్షేమం, మహిళల భద్రత వంటి అంశాలపై వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆత్మహత్య ఘటనలపై స్పందిస్తూ, వాటి వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

పోలీసు సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రధాన కార్యాలయంలో నూతన వ్యాయామ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులు సమర్థంగా నిర్వహించగలరని అన్నారు. సైబర్ నేరాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

రోడ్లపై అక్రమ పార్కింగ్ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైవే పెట్రోలింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు రహదారి భద్రతపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని అన్నారు.కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  చిన్న జిల్లాలైన భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో పోలీసు శాఖకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చి చర్యలు చేపడతామని చెప్పారు. నక్సలైట్ హింస ప్రభావిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భూ వివాదాల విషయంలో చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మహిళల భద్రతకు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన రక్షణ, సహాయం అందించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆధునిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం డీఐజీ–పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఈగల్ ఎస్పీ గిరిధర్, సీఎస్‌బీ ఎస్పీ సాయిశ్రీ, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఏఎస్పీ బట్టాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.