10 August, 2026 | 3:16 AM

కొమురంభీమ్ పోరాట పటిమ చరిత్రలో నిలిచిపోతుంది

10-08-2026 02:14 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

భూపాలపల్లి టౌన్,ఆగస్టు 09 (విజయక్రాంతి): కొమరం భీమ్ పోరాట పటిమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని భూపాలపల్లి  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల భూమి, అటవీ సంపదపై వారికి హక్కు ఉండాలని, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించబడాలని కొమరం భీమ్ పోరాటం చేశారని గుర్తు చేశారు.

కొమరం భీమ్ ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీ సోదరుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కొమరం భీమ్ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడే స్ఫూర్తిని నేటి తరం ఆదివాసీ యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆదివాసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.