ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట, జూన్ 28: పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, గొల్లగూడెం గ్రామ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకరమైన వ్యాధి నుంచి పిల్లలను రక్షించేందుకు పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకం. ఒక్క చిన్నారి కూడా ఈ చుక్కలకు దూరం కాకూడదు. ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పట్టణ మండల అధ్యక్షులు చీల మల్లన్న, పెద్ద గొల్ల ఆంజనేయులు, గొల్లగూడెం సర్పంచ్ మునిగే సుజాత, ఉప సర్పంచ్ కొల్కూరి అశోక్ కుమార్, వార్డ్ మెంబర్లు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






