డాక్టర్ హత్యపై రాజకీయ రచ్చ
- దవాఖానపై అర్ధరాత్రి మూకదాడి
- కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం
- 9 మంది అరెస్టు
- టీఎంసీ, బీజేపీ మాటల తూటాలు
కోల్‌కతా, ఆగస్టు 15: కోల్‌కతాలోని ఆర్‌జీ ఖర్ ప్రభుత్వ దవాఖానలో వైద్యురాలి అత్యాచారం, హత్యపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఈ దారుణాన్ని నిరసిస్తూ ఒకవైపు దేశవ్యాప్తంగా వైద్యులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తుండగా.. బుధవారం అర్థరాత్రి ఓ అల్లరిమూక దవాఖానపై దాడిచేసి కేసు ఆధారాలు చెరిపేయాలని చూడటం కలకలం రేపింది.
మూకదాడి
గత శుక్రవారం వైద్యురాలి హత్య ఘటన వెలుగుచూసిన తర్వాత నుంచి ఆర్‌జీ ఖర్ దవాఖాన వైద్యులతోపాటు అనేకచోట్ల వైద్యులు నిరవధిక నిరసన చేపట్టారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ గుంపు ఒక్కసారిగా దవాఖానలోకి దూసుకొచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడులు చేస్తూ వాహనాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా దవాఖానలో వైద్యురాలిపై లైంగికదాడి జరిగిన కాన్ఫరెన్స్ హాల్‌లోకి దూసుకెళ్లి ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని అక్కడ విధులు నిర్వహిస్తున్న దవాఖాన సిబ్బంది తెలిపారు. ఈ మూకదాడిలో 15 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డట్టు పోలీసులు వెళ్లడించారు మూకదాడి తర్వాత గురువారం ఉదయం పోలీసులు పలు ఫొటోలను మీడియాకు విడుదల చేసి అందులో ఉన్నవాళ్ల ఆచూకీ చెప్పాలని కోరారు. ఆ తర్వాత గంట సేపటికే 9 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు.
మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు: డాక్టర్ అనుభవ్
పోలీసులు విడుదల చేసిన మూకదాడి నిందితుల ఫొటోల్లో తన ఫొటో కూడా ఉన్నదని ఆర్ జీ ఖర్ దవాఖాన వైద్యుడు అనుభవ్ మొండల్ తెలిపారు. వైద్యురాలి హత్యకు నిరసన తెలుపుతున్నవారిలో ఆయన కూడా ఉన్నారు. ‘మా పోరాటం కొనసాగుతుంది. ఇంకా తీవ్రతరం అవుతుంది కూడా. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ, అందులో వారు విజయవంతం కాలేరు. ఏది ఏమైనా న్యాయం జరిగేవరకు మేం వదిలేదే లేదు.
కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలనేదే మా ప్రధాన డిమాండ్’ అని స్పష్టంచేశారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గురువారం దవాఖానను సందర్శించి నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ‘మీకు నేనున్నా. ఇలాంటి దుర్మార్గాలపై కలిసి పోరాడుదాం. భవిష్యత్ తరాలకు సానుకూల సందేశమిద్దాం’ అని తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్‌లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. దవాఖానపై దాడి చేసింది మీరంటే మీరని ఆరోపణలు గుప్పించుకొంటున్నారు.
వైద్యుల సమ్మె
దవాఖానపై మూకదాడితో వైద్యులు భగ్గుమన్నారు. నిలిపివేసిన నిరవధిక సమ్మెను తిరిగి చేపడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు దవాఖానపై దాడి బీజేపీ, సీపీఎం కార్యకర్తల పనేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.




