11 April, 2026 | 7:55 AM

మత చట్టాలకు కాలం చెల్లింది

16-08-2024 12:38 AM
  1. ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చే సమయం వచ్చింది
  2. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి
  3. అవినీతిపరుల గుండెల్లో భయమే నా లక్ష్యం
  4. కుల, వంశ రాజకీయాలకు చరమగీతం పాడాలి
  5. ఎర్రకోటపై ప్రసంగంలో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో మతాలకు అతీతంగా పౌర స్మృతిని తీసుకురావాల్సిన సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న కోడ్ మతపరమైనదని, వివక్ష చూపుతోందన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ గురువారం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. వరుసగా 11వ సారి ప్రధాని హోదాలో ఆయన జెండావిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమానికి 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంకోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలను ప్రస్తావించారు. అంతకుముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ స్మారకం వద్ద మోదీ నివాళులు అర్పించారు.

యూసీసీకి సమయం ఇదే..

ఉమ్మడి పౌరస్మృతిపై తన ప్రసంగంలో ప్రధానంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. దేశాన్ని విభజించే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదని, వాటిని తప్పనిసరిగా తొలగించాలని ఎర్రకోట వేదికగా స్పష్టం చేశారు. యూసీసీపై సుప్రీంకోర్టు పదేపదే చర్చలు జరిపి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కోడ్ మతపరమైనదని, వివక్షతతో కూడినదని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగ నిర్మాతల కల అని రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెబుతున్నాయి. దానిని నెరవేర్చడం మా కర్తవ్యం. దీనిపై ఇంకా విస్తృత చర్చలు జరగాలి. ప్రతి ఒక్కరూ అభిప్రాయాలను చెప్పాలి. మతపరంగా దేశాన్ని విభజించే చట్టాలను తొలగించాలి అని చెప్పారు. 

వారికి వెన్నులో వణుకు పుట్టాలి

మహిళలపై జరుగుతునన అఘాయిత్యాలపై సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవు తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రం గా పరిగణించాలని ప్రధాని మోదీ సూచించారు. అన్ని రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారని, కానీ కొన్ని ఆందోళనకర పరిణామాలు కూడా ఉన్నాయన్నారు. మహిళల పై నేరాలను వీలైనంత త్వరగా విచారించాలి. పైశాచిక చర్యలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇదే ఎంతో అవసరం.

ఘటన జరిగినప్పుడు మీడియాలో చర్చలు జరుగుతాయి. కానీ వారికి శిక్షలు పడినప్పుడు పెద్ద కనిపించవు. నేరస్థులు భయపడేలా శిక్షలను విస్తృతంగా ప్రచా రం జరగాలి అని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య గురించి ప్రస్తావిస్తూ ప్రధాని ఈ మేరకు మాట్లాడారు. అందరికీ న్యాయం చేకూర్చేందుకు బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి కొత్తగా మూడు చట్టాలను తెచ్చామని తెలిపారు. 

ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి..

వికసిత్ భారత్2047 నినాదం కోసం 24x7 కష్టపడుతామని, భారత్‌ను ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి పాలన, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ కల త్వరలో సాకారం కావాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనేది తమ ప్రభుత్వ వ్యూహామని, ఈ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. 

మోదీ రికార్డు ప్రసంగం

ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం సుదీర్ఘంగా కొనసాగింది. ఏకధాటిగా 98 నిమిషాలు మాట్లాడి రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధాని ఇంతసేపు ప్రసంగించలేదు. కాగా 2016లో 96 నిమిషాలు మాట్లాడగా.. 2017లో అతి తక్కువగా 56 నిమిషాలు మోదీ ప్రసంగించారు. మోదీకి ఇదే అతిచిన్న ప్రసంగం. 2014లో ప్రధాని మోదీ తొలి ప్రసంగం 65 నిమిషాల పాటు సాగింది. ఇప్పటివరకు ప్రధానుల ఎర్రకోట ప్రసంగాల సగటు సమయం 82 నిమిషాలు. 

కాంగ్రెస్సేతర ప్రధానిగా అత్యధిక సార్లు

ప్రధానిగా మోదీ మరో రికార్డును సైతం ఆయన ఖాతాలో వేసుకున్నారు. 11 సార్లు ఎర్రకోటపై ప్రసంగం చేసిన కాంగ్రెస్సేతర ప్రధానిగా నిలిచారు. ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక పంద్రాగస్టు ప్రసంగాలను జవహార్‌లాల్ నెహ్రూ చేశారు. 17 సార్లు నెహ్రూ ఎర్రకోటపై ప్రసంగించారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టును జాతినుద్దేశించి ప్రసంగించారు. 

లెహెరియా టర్బన్

స్వాతంత్య్ర వేడుకలకు ప్రధాని మోదీ రంగురంగుల రాజస్థానీ లెహెరియా ప్రింట్ టర్బన్‌ను ధరించి వచ్చారు. కాషాయం, పసుపు, ఆకుపచ్చ రంగులతో ఈ టర్బన్‌ను ప్రత్యేకంగా చేశారు. కాగా, 2014 నుంచి వేర్వేరు శైలులకు చెందిన టర్బన్లను ధరిస్తూ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ధరిస్తున్నారు. అదే ఆనవాయితీని గురువారం కొనసాగించారు.