29 July, 2026 | 12:37 AM

బూడిద బతుకులు!?

29-07-2026 12:00 AM
  1. సరిహద్దు గ్రామాలపై బీటీపీఎస్ కాలుష్య ముసురు 
  2. పొలాలు, ఇండ్లపై పేరుకుపోతున్న బూడిద
  3. గ్రామస్తుల్లో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు 
  4. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణు గూరుపినపాక మండలాల సరిహద్దు గ్రామాల్లో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బిటిపీఎస్) వెదజల్లుతున్న బూడిద కాలుష్యం స్థానిక ప్రజల జీవితాలను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తోంది. రోజూ కురిసే బూడిద వర్షంతో పరిసర గ్రామాలు కాలుష్య ముసురులో చిక్కుకున్నాయి. ‘కరెంటు వెలుగులు ప్లాంట్లో నిండుతుంటే.. మా బతుకులు మాత్రం బూడిద పాలవుతున్నాయి‘ అని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజూ ఇళ్లపై బూడిదే..

ప్లాంట్ నుంచి వెలువడుతున్న సూక్ష్మ బూడిద కణాలు గాలిలో కలిసి చుట్టుపక్కల గ్రామాలపై పడుతున్నాయి. ఇళ్ల ప్రాంగణాలు, తాగునీటి గుంటలు, చివరికి వండు కునే ఆహార పదార్థాలపై సైతం బూడిద పొరలు పేరుకుపోతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దు మ్ము, బూడిదను దులుపుకోవడమే సరిపోతోందని గృహిణులు వాపోతున్నారు.

హెచ్చరిస్తున్న శ్వాసకోశ సమస్యలు

ఈ బూడిద కాలుష్యం కారణంగా గ్రామీణుల్లో, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా, నిరంతరం దగ్గు, చ ర్మ సంబంధిత అలర్జీలు, కంటి మంటలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. కాలుష్య తీవ్రత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పదని హెచ్చరిస్తున్నారు.

హరితవనం లేక మరింత ఇబంధులు

సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల చుట్టూ దట్టమైన మొక్కలతో గ్రీన్ బెల్ట్ (హరితవనం) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ సరైన రీతిలో హరితహారం లేదా చెట్ల పెంపకం చేపట్టకపోవడంతో బూ డిద గాలికి సులువుగా కొట్టుకొచ్చి పరిసర గ్రామాలను ముంచెత్తుతోంది. యాష్ పాం డ్ల నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, గాలి వీచినప్పుడు నీటిని పిచికారీ చేయకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది.

అధికారులు స్పందించాలి!

తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కాలుష్య సమస్యపై కాలుష్య నియంత్రణ మండలి జన్కో యాజమాన్యం తక్షణమే స్పందించాలని మణుగూరు-పినపాక సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యాష్ పాండ్లలో నీటి పిచికారీ శాతాన్ని పెంచాలని, ప్లాంట్ చుట్టూ దట్టమైన చెట్లతో హరితవనం నిర్మించాలని, ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.