29 July, 2026 | 12:37 AM

అసంపూర్తి భవనాలు.. అరకొర వసతులు!

29-07-2026 12:00 AM
  1. మనఊరు - మనబడి పథకంలో నిధులు రాక ఆటంకం
  2. జెడ్పిహెచ్‌ఎస్ లలో నిలిచిపోయిన డైనింగ్ హాల్ పనులు 
  3. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 28 :  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే సంకల్పంతో ప్రారం భించిన మనఊరు - మనబడి పథకం నిధుల కొరతతో చతికిలబడింది.నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో నియోజకవర్గంలో ని పలు ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదు లు,డైనింగ్ హాల్ల నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.2022లో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టినప్పటికీ కొన్ని గ్రామాల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి.మరికొన్ని గ్రామాల్లో పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో వి ద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు.

 నియోజకవర్గ వ్యాప్తంగా ఆగిన నిర్మాణాలు

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నాగారం మండలా ల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్ర ధానంగా డైనింగ్ హాల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.మరికొన్ని పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం,విద్యుద్దీకరణ,నీటి సంపులు వంటి పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి.జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో నాలుగేళ్లుగా డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి కాకుండా అలాగే ఉంది. నా గారం మండలం వర్ధమానుకోటలో ఇదే పరిస్థితి నెలకొన్నది.ఇక జాజిరెడ్డిగూడెం జెడ్పిహెచ్‌ఎస్ లో అయితే అసలు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

విద్యార్థులకు చెట్లకిందే మధ్యాహ్న భోజనం

డైనింగ్ హాల్ల నిర్మాణం పూర్తికాని పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కూర్చోవడానికి సరైన వసతి లేక ఎండనక, వాననక చెట్ల కింద ఆరు బయట కూర్చుని భోజనం చేయాల్సి వస్తుంది.గాలికి అన్నం లో చెత్త,దుమ్ము పడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు దీన్నే తింటున్నారు. చేసిన పనులకు కూడా ఇంతవరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను ముందుకు తీసుకెళ్లడం లేదు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలని,అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి తమ ఇబ్బందులు తొలగించాలని ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

 చెట్ల కింద భోజనం చేయడంతో అన్నంలో చెత్త పడుతుంది

 మా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం డైనింగ్ హాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు.కానీ ఇంతవరకు వాటిని పూర్తి చేయలేదు.దీంతో మేము ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాన్ని పాఠశాల ఆవరణలోని చెట్ల కిందనే కూర్చుని తింటున్నాం.బయట కూర్చోవడం వల్ల గాలికి అన్నంలో చెత్త దుమ్ము పడుతున్నాయి.అధికారులు స్పందించి ఈ పనులను త్వరగా పూర్తిచేసి మా ఇబ్బందులు తీర్చాలి.

ఎల్. ప్రవల్లిక, 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ తిమ్మాపురం

 నిధులు మంజూరు చేసి అందుబాటులోకి తీసుకురావాలి

2022లో ప్రారంభమైన మనఊరు మనబడి పథకంలో మా గ్రామ పాఠశాల ఎంపికైంది.నిధుల లేమిటో అసంపూర్తిగా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి.ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసి డైనింగ్ హాల్ ను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి.    

తండా లింగమూర్తి గౌడ్,మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ తిమ్మాపురం.