29 July, 2026 | 12:37 AM

వట్టేరు వాగుపై వంతెన నిర్మాణం

29-07-2026 12:00 AM

ఏళ్ల తరబడి కష్టాలకు పరిష్కారం 

మహబూబాబాద్, జులై 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కేసముద్రం మండలాల సరిహద్దులో ప్రతి ఏటా వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వట్టేరు వాగుపై కొత్తగా హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టారు. 1977లో అప్పటి ప్రభుత్వం వట్టేరు వాగు పై లో లెవెల్ వంతెన నిర్మించారు. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో భారీగా వస్తుండడంతో లో లెవెల్ వంతెన పైనుండి సుమారు 4 అడుగుల ఎత్తులో వరద పొంగి ప్రవహిస్తోంది.

దీనివల్ల కేసముద్రం, గూడూరు మండలాల మధ్య రాకపోకలు రోజుల తరబడి స్తంభించడంతోపాటు, కేసముద్రం మండలంలోని కాట్రప ల్లి, అర్పణ పల్లి, గూడూరు మండలంలోని నాగారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనజీవన స్రవంతికి రోజుల తరబడి దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుండేది. కొందరు వర్షాకాలంలో వాగు ప్రవా హంలో కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు.

అప్పటినుండి ప్రతి ఏటా వర్షాకా లంలో వరద పొంగి ప్రవహించే సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు, రెవె న్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక పర్యా యాలు వట్టేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ప్రతి వర్షాకాలంలో ఆయా గ్రామాలకు ముందుగానే రేషన్ సరుకులను అందజేయడం, ఇతర ముందస్తు ఏర్పాట్లను చేయ డం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారేది.

వాగు పొంగి ప్రవహిస్తే ఒక్కోసారి రెండు రోజుల నుండి మూడు రోజులపాటు ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఇరు మండలాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయేవి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా అర్పణ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి నియమితులు కావడంతో తమ గ్రామంతో పాటు మహబూబాబాద్ జిల్లా లో ప్రతి వర్షాకాలంలో ఇతర ప్రాంతాలకు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న వట్టేరు వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణంతోపాటు కేసముద్రం గూడూరు ఆర్ అండ్ బి రహదారి విస్తరణ పనులకు 50 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా మంజూరు చేయించారు.

దీనితో ఇటీవల వట్టేరు వాగు పై అర్పణ పల్లి వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం వట్టేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులు స్లాబ్ లెవల్ వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా కొంత పిల్లర్ల నిర్మాణం పూర్తికాగానే కొద్ది రోజుల్లో హై లెవెల్ వంతెనకు స్లాబ్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న లో లెవెల్ వంతెనకు సుమారు 6 అడుగుల ఎత్తు పై నుండి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.

గత కొన్నేళ్ల నుండి వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసిన రాకపోకలకు ఆటంకం లేకుండా బ్రిడ్జిని అత్యంత హై లెవెల్ స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తిచేసి త్వరలో కేసముద్రం గూడూరు ప్రాంత ప్రజలకు వర్షాకాలంలో ఎటువంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించడానికి మార్గం సుగమం కానుంది.