మేడ్చల్‌లో చెరువుల కబ్జా
మేడ్చల్, మే 28(విజయక్రాంతి): సందు చూసి ఏదో చేసినట్లు.. అధికారులు ఎన్నికల బిజీలో ఉంటే కొందరు కబ్జాకోర్లు చెరువులను మింగేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోనే వెంచర్లు చేసి అమ్మకానికి పెట్టారు. కళ్లెదుటే ప్లాట్లు, హద్దుల రాళ్లు కనిపిస్తున్నా... అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. కాలు కదపడం లేదు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు చెరువులు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే... నగరశివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామ పరిధిలోని ఎన్నా చెరువు కింది భాగంలో గ్రీన్ పార్క్ కాలనీ ఉంది.
చెరువుకు ఉత్తరం వైపు సీలింగ్ స్థలంలో సీవరేజ్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. గ్రీన్ పార్కు కాలనీకి చెరువుకు మధ్యలో ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్‌టీఎ ల్) స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ కొందరు తెగబడిపోయారు. సర్వే నంబర్ 85 నుంచి 95 గల ఎఫ్‌టీఎల్‌లో సుమారు ఎకరం స్థలంపై కన్నేశారు. ఏకంగా చదును కూడా చేయించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. త్వరలో ప్లాట్లు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో చదును చేస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేసినప్పటికీ, ప్రస్తుతం రాజకీయ నాయకుల అండదండలతో ల్యాండ్ ఆక్రమణలను మళ్లీ మొదలు పెట్టారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు కూడా అన్యాక్రాంతమవుతున్నది. 318/ఈ, 318/ఆ/బి సర్వే నంబర్లలోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో భూములపై కొందరు కన్నేశారు. సుమారు 30 గుంటల భూమిని ప్లాట్లుగా అమ్మేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవలే రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులు గుర్తించినప్పటికీ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో వెలిసిన లేఅవుట్ ను అధికారులు కూల్చివేశారు. ఇలా చాలా మందికి రిజిస్ట్రేషన్లు సైతం చేయించారు.
ప్రహరీలను కూల్చివేశాం..
కుత్బుల్లాపూర్ మండల ఆర్‌ఐ రేణుకను వివరణ కోరగా గతంలో ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన సుమారు పది వరకు ప్రహరీ గోడలను కూల్చివేయించాం. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించి ఉన్నతాధికా రుల సూచనతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.






