రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు
- బీజేపీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం
- ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బురదజల్లే ప్రయత్నం
- డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం, జూలై 29(విజయక్రాంతి): జంతర్ మంతర్ వేదికగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేని అసమర్థతకు నిదర్శనమని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భావి భారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతూ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక వ్యక్తిగత విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక అసమానతలు, మహిళల భద్రత వంటి కీలక అంశాలపై ప్రజలు సమాధానం కోరుతుంటే, వాటిని పక్కనబెట్టి రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని చౌకబారు రాజకీయాలు చేయడం బీజేపీ వైఫల్యాన్ని బయటపెడుతోందన్నారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తే అవే నిజాలవుతాయని బీజేపీ భ్రమపడుతోందని విమర్శించారు.
జంతర్ మంతర్లో జరిగిన కార్యక్రమాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎంత చేసినా సత్యాన్ని దాచలేరన్నారు. ప్రజల అసలు సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షంపై బురదజల్లడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల తీర్పు అన్నింటికంటే గొప్పదని, అహంకారం, అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని నూతి సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.






