నా సవాల్‌ను పొన్నం స్వీకరించాలి
- నేడు జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రావాలి
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఫ్లు యాష్ రవాణ అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తన సవాల్‌ను స్వీకరించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం 12 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కు రాకపోతే అన్ని స్కాంలు చేసినట్లేనని, అక్రమంగా వేలకోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఒప్పుకున్నట్లేనని కౌశిక్‌రెడ్డి అన్నారు. మంగళవారం వీణవంకలోని తన స్వగృహంలో తడిబట్టలతో ప్రమాణం చేసి, విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకుల సవాల్ స్వీకరించి, చెల్పూర్ హనుమాన్ ఆలయానికి వెళ్తుంటే 200 మంది పోలీసులు తనను హౌజ్ అరెస్టు చేశారని తెలిపారు. అక్కడకు రాకపోయినా దేవుడి సాక్షిగా కాంగ్రెస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన నిజాయితీని నిరూపించుకునేందుకు తడిబట్టలతో ప్రమాణం చేశానని చెప్పారు. తాను ఎక్కడా కూడా అవినీతి చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరి, వారే పోలీసులను పంపి అరెస్టు చేయిస్తారని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి సవాల్‌కు సిద్ధపడి రావాలని, తాను ఒక్కడినే వస్తానని చెప్పారు.






