2 May, 2026 | 12:33 AM

రాజకీయాల్లో కౌశిక్‌రెడ్డి ఒక జోకర్

26-06-2024 12:49 AM
  • కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్

హుజూరాబాద్, జూన్ 25: రాజకీయాల్లో కౌశిక్‌రెడ్డి ఒక జోకర్ అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు ఎద్దేవా చేశారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశాడని బాధితులు స్పష్టమైన ఆధారాలతో చెల్పూర్ హనుమాన్ ఆలయానికి వచ్చినా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాలేదని, దేవుడు సాక్షిగా ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతున్నారన్నారు. మంగళవారం సింగాపూర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.. తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకున్నా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నాడన్నారు.

తాము విసిరిన సవాల్‌కు కట్టుబడి ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టామని, స్వయంగా ఎవరైతే డబ్బులు ఎమ్మెల్యేకు ఇచ్చారో వారే చెల్పూర్‌లోని హనుమాన్ ఆలయంలో తడిబట్టలతో కొబ్బరికాయ కొట్టారని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో ఆలయానికి రాకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉనికి కాపాడుకోవాలనే దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు.

దిగజారుడు, బ్లాక్‌మెయిల్ చేయడంలో కౌశిక్‌రెడ్డి చరిత్ర సృష్టించాడన్నారు. ఇక నుంచి హుజూరాబాద్ అభివృద్ధి పట్ల దృష్టి సారిస్తామని ప్రణవ్ తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొనగంటి మల్లయ్య, నాయకులు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్, దేశిని కోటి, గూడెపు సారంగపాణి, సొల్లు బాబు, వేముల పుష్పలత, ఆలేటి సుశీల, పూదరి రేణుక, శివగౌడ్, సారంగపాణి పాల్గొన్నారు.