27 April, 2026 | 1:17 AM

జన గణన షురూ!

27-04-2026 12:00 AM

జిల్లాలో జనాభా లెక్కల ప్రక్రియ 

10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం

కరీంనగర్, ఏప్రిల్26 (విజయక్రాంతి): దేశ జనాభా లెక్కల ప్రక్రియ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం నుండి ప్రారంభించారు. 2011 జనాభా తో పోల్చుకుంటే 10 నుండి 15 శాతం జనాభా పెరిగే అవకాశం ఉంది. 2011లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనాభా 37,76,269 కాగా, అందులో పురుషులు 18,80,800 మంది, స్త్రీలు 18,95,469 మంది ఉన్నారు. 2001 నాటి జనాభాతో పోలిస్తే 2011 జనాభాలో 8.15 శాతం మార్పు నమోదైంది. 2001 నాటి గత భారత జనాభా లెక్కల ప్రకారం, 1991తో పోలిస్తే కరీంనగర్ జిల్లా జనాభాలో 14.96 శాతం పెరుగుదల నమోదైంది. ఈ సారి 10 నుండి 15 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కరీంనగర్ అక్షరాస్యత రేటు

2011లో 64.15గా ఉంది. లింగాల వారీగా చూస్తే, పురుషుల అక్షరాస్యత 73.65గా, మహిళల అక్షరాస్యత 54.79గా ఉంది.2001 జనాభా లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలో ఈ సంఖ్యలు 67.09, 42.75గా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 22,06,829 కాగా, వీరిలో పురుషులు 12,57,238, మహిళలు 9,49,591 మంది ఉన్నారు.

కరీంనగర్ లింగ నిష్పత్తి

2011 నాటికి 1008కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ లింగ నిష్పత్తి 940గా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 935 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ సారి అక్షరాస్యత శాతం పెరగనుంది.ఈ సారి డిజిటల్ విధానంతో..ఉమ్మడి జిల్లాలోఆన్ లైన్ జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమయింది. రెండు దశల్లో జరగనుంది.మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఆన్లైన్ లో పొందుపరిచిన 36 అంశాల్లో గందరగోళం నెలకొంది. ఇది ఆర్థిక సర్బ్ నా లేక జనాభా గణనన అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.