7 July, 2026 | 5:48 PM

ఎన్నికల తర్వాత మొబైల్ ఛార్జీల బాదుడు

15-05-2024 12:20 AM

25 శాతం పెరగవచ్చని అంచనా

ముంబై, మే 14: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలికం ఆపరేటర్లు మొబైల్ ఛార్జీలను 25 శాతం మేర పెంచుతారని విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. మొబైల్ కంపెనీలు వాటి ఏఆర్‌పీయూ (ఒక్కో వినియో గదారు నుంచి లభించే సగటు ఆదాయం) పెంచుకోవడానికి నాల్గవ రౌండు పెంపుదలకు సిద్ధమవుతున్నట్టు యాక్సిస్ క్యాపిటల్ తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. 5జీ నెట్‌వర్క్ కోసం భారీ పెట్టుబడులు అవసరం ఉన్నందున, సమీప భవిష్యత్తులో టెలికాం ఆపరేటర్లు టారీఫ్‌లను 25 శాతం వరకూ పెంచుతారని అంచనా వేసింది. 25 శాతం ఛార్జీలను పెంచితే ఆపరేటర్ల ఏఆర్‌పీయూ 16 శాతం వృద్ధిచెందుతుందని, భారతి ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ.29 మేర, జియో ఏఆర్‌పీయూ రూ.26 మేర పెరుగుతుందని యాక్సిస్ క్యాపిటల్ అంచనాల్లో వివరించింది. 2024 మార్చి త్రైమాసికంలో జియో రూ.181.7 ఏఆర్‌పీయూను నమోదుచేయగా, భారతి ఎయిర్‌టెల్ రూ.209, వొడాఫోన్ ఐడియా రూ.145 చొప్పున ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని సాధించాయి. 2019 సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో టెలికాం కంపెనీలు మూడు దఫాలు టారీఫ్‌లను పెంచాయి. 

పెంపు తప్పదు

టారీఫ్ పెంపు తప్పదంటూ యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. గత టారీఫ్‌ల పెంపుతో దేశంలో రెండో పెద్ద కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్ అధికంగా లబ్దిపొందిందని, ఈ దఫా ఛార్జీల పెంపుతో సైతం ఇదే సంస్థ ఎక్కువగా లాభపడుతుందని యాంటిక్ బ్రోకింగ్ వివరించింది. ప్రస్తుతం రూ.209 ఉన్న భారతి ఏపీఆర్‌యూ (ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్) మూడేండ్లలో రూ.286కు పెరుగుతుందని అంచనా వేసింది. టారీఫ్ పెరుగుదలతో రూ.55 మేర, 2జీ కస్టమర్లు 4జీకి మారడం ద్వారా రూ.10, కస్టమర్లు 4జీ, 5జీకి అప్‌గ్రేడ్‌కావడం, పోస్ట్‌పెయిడ్‌కు మారడంతో రూ. 15 మేర ఏపీఆర్‌యూ పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీ అంచనా వేసింది. భారతి మార్కెట్ వాటా గత ఏడాదికాలంగా 29.4 శాతం నుంచి 33 శాతానికి, జియో వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి చేరిందని రిపోర్ట్ తెలిపింది.

చౌక ప్యాక్స్ తొలగింపు

టెలికాం కంపెనీలు క్రమేపీ తక్కువ టారీఫ్‌గల ప్యాక్‌లను తొలగిస్తాయని, అదే సమయంలో 4జీ/5జీ ప్యాక్స్ ధరల్ని పెంచుతాయని, తద్వారా ఈ సంవత్స రాంతానికి ఏఆర్‌పీయూను 10 శాతం మేర పెంచుకుంటాయని డెలాయిట్ దక్షిణాసియా టీఎంటీ ఇండస్ట్రీ లీడర్ పియూష్ వైష్ అంచనా వేశారు. వాయిస్/డాటా కోసం ఆఫర్ చేస్తున్న  రూ. 40/50 సింగిల్ ప్యాక్స్‌ను ఎత్తివేస్తాయని, దీంతో యూజర్లు బండిల్డ్ ప్లాన్స్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రణాళిక ద్వారా ఏఆర్‌పీయూలు సగటున రూ.120 మేర పెరుగుతాయని వివరించారు. హైస్పీడ్ డేటాకు అలవాటుపడిన వినియోగదారులు పెంచిన టారీఫ్‌ల్ని చెల్లించేందుకు సిద్ధపడతారని చెప్పారు.