7 July, 2026 | 6:53 PM

31 శాతం తగ్గిన ఎయిర్‌టెల్ లాభం

15-05-2024 12:15 AM

ఆదాయం రూ.37,599 కోట్లు

రూ.2,544 కోట్ల ఫారెక్స్ నష్టం

షేరుకు రూ.8 చొప్పున డివిడెండు

న్యూఢిల్లీ, మే 14: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ 2024 మార్చితో ముగిసిన త్రైమాసికానికి నిరాశాపూరిత ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. క్యూ4లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 31 శాతం క్షీణించి రూ.2,072 కోట్లకు తగ్గింది. మెజారిటీ విశ్లేషకుల అంచనా రూ.3,274 కోట్లతో పోలిస్తే లాభం భారీ తగ్గుదలతో నమోదయ్యింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో రూ. 3,006 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం 4 శాతం వృద్ధిచెంది రూ. 36,009 కోట్ల నుంచి రూ. 37,599 కోట్లకు పెరిగింది. 2024 జనవరి త్రైమాసికంలో ఆఫ్రికా కరెన్సీలు ప్రత్యేకించి నైజీరియా నైరా కరెన్సీ పతనంకావడంతో ఆదాయ లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. రూ.2,544 కోట్ల ఫారెక్స్ నష్టాన్ని చవిచూసింది. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.8 చొప్పున తుది డివిడెండు సిఫార్సుచేసింది. 

ఏపీఆర్‌యూ రూ.209

క్యూ4లో ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ (ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్) రూ.209కు పెరిగింది. నిరుడు ఇదే త్రైమాసికంలో రూ.193 ఏపీఆర్‌యూను సాధించింది. కంపెనీ ఇండియా కార్యకలాపాల ఆదాయం 13 శాతం పెరిగి రూ. 28,513 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఇబిటా 4 శాతం వృద్ధిచెంది రూ.18,807 కోట్ల నుంచి రూ. 19,590 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్ 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 52.1 శాతంగా నమోదయ్యింది. ఎయిర్‌టెల్ క్యూ4లో కొత్తగా హై వాల్యూ విభాగంలో 3.31 లక్షల కస్టమర్లను సంపాదించుకుంది.