18-02-2026 01:07:58 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): సిద్ధాంతాల పేరుతో ఓటర్లను చీల్చిన రాజకీయాలు.. ఫలితాల తర్వాత మాత్రం ఒకే టేబుల్ చుట్టూ కూర్చుని పదవుల పంచాయితీ! కాగజ్‌నగర్ మున్సిపా లిటీలో జరిగిన చైర్మన్‌వైస్ చైర్మన్ ఎన్నికలు ఇదే వాస్తవాన్ని మరోసారి బయటపెట్టాయి. అంతేకాకుండా అసిఫాబాద్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బిఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఓట్ల కోసమే భావోద్వేగాలు..
ఎన్నికల సమయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, జాతీయ రాజకీయాలు, మతపరమైన భావోద్వేగాలు అన్నీ ఓట్ల కోసమే..కానీ ఫలితాలు వెలువడిన వెంటనే సిద్ధాంతాలు పక్క పెట్టి అధికారమే లక్ష్యంగా మారింది. పరస్పరం విభిన్న సిద్ధాంతాలున్న జాతీయ పార్టీ లు అయిన కాంగ్రెస్, బీజేపీ కాగజ్‌నగర్లో ఒక్కటయ్యాయి. ఆసిఫాబాద్‌లో మాత్రం బిఆర్‌ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ గుండా స్నేహ తమ వైపు తిప్పుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చారు.
సంఖ్యాబలం కాదు..
30 వార్డులున్న కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీకి 5, ఎంఐఎంకు 1, స్వతంత్రులకు 4 సీట్లు వచ్చాయి. చైర్మన్ ఎన్నికకు 16 మంది మెజార్టీ అవసరం. బీఆర్‌ఎస్ మద్దతులతో సంఖ్య 14కే పరిమితమవగా, కోరం అడ్డంకిగా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ మధ్య తెరవెనుక ఒప్పందం ఫలించింది. 20 వార్డులు ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోను ఏ పార్టీకి సంఖ్యా బలం లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.
బిఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 7, స్వతంత్రులు 4 గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 4 స్వతంత్రుల మద్దతుతో ఎన్నికల్లో పాల్గొనగా కాంగ్రెస్ చెందిన చైర్మన్ అభ్య ర్థి అబ్దుల్లాకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ స్నేహ చేతులు ఎత్తకుండా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్‌కు చేతులెత్తి మద్దతు తెలిపారు.దీంతో బీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను కైవసం చేసుకుంది.
చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ
మంగవారం కాగజ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన షాహిన్ సుల్తానా చైర్మన్‌గా, బీజేపీకి చెందిన డాక్టర్ అనిత వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇది అధికార ఏర్పా టు మాత్రమేనని, ప్రజాస్వామ్య విజయంగా భావించలేమన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
రెండింటిలోనూ అదే తీరు...
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోనూ సిద్ధాంతాల కంటే సంఖ్యాబలమే కీలక మైంది. రాష్ట్ర స్థాయిలో వేర్వేరు వైఖరులు, స్థానికంగా వేర్వేరు పొత్తులు, అవకాశవాద రాజకీయాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఓటు అడిగినప్పుడు ఒక మాట అధికా రం దక్కినప్పుడు మరో మాట ఇదేనా ప్రజాస్వామ్యం.. సమస్యల పరిష్కారం కోసం ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.. మా సమస్యలకా.. మీ పదవులకా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.