18-02-2026 12:31:26 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఫిబ్రవరి 17న ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు, ఉద్యమం పుట్టిన రోజు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవంతో బతుకుతున్నదంటే దానికి కేసీఆరే కారణమన్నారు. ఆనాడు శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, జాతి ఆత్మగౌరవాన్ని రూపు మాపే కుట్రలు జరిగాయని గుర్తుచేశారు.
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణ యాస, భాష, జాతి గౌరవం దెబ్బతిన్న సమయంలో నేనున్నానంటూ బయల్దేరిన నాయకుడు కేసీఆర్ అని, ఆ కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా కేసీఆర్ నినదించారని గుర్తుచేశారు.
ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాలు, పొత్తులు చూశామని, పదవి కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టి ఎలా కలిసాయో చూశామని, కానీ కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఏ ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రాణాన్ని సైతం వదిలేందుకు సిద్దపడ్డారని గుర్తుచేశారు. కేసీఆర్ ఒక నాయకుడు, ఉద్యమ కారుడే కాదు..
తెలంగాణ వాళ్లకు పాలన రాదు అని అనే స్థాయి నుంచి తెలంగాణ ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అనే స్థాయికి చేర్చారని కొనియాడారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఒక చరిత్ర అని, అలాంటి కేసీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా చరిత్రే అన్నారు. నిజంగా నాలాంటి వారికి 25 ఏళ్లు ఉద్యమంలో, ప్రభుత్వం, ప్రతిపక్షంలో వారి అడుగుజాడల్లో నడిచే అవకాశం కల్పించారని తెలిపారు.
ఓటమి తాత్కాలికం మళ్లీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని, అందరి ప్రార్థనలతో, దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అందరం ఒక్క తాటిపై నడుద్దాం, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు.