ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు
మేడ్చల్/యాదాద్రి భువనగిరి, జూన్ 3 (విజయక్రాంతి): నగర శివారులో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురు గాలులతో వర్షం కురవడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. అదే విధంగా మేడ్చల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి విద్యుత్ సరఫరా చేసే స్తంభంపై భారీ వృక్షం కూలి రెండు స్తంభాలు విరిగిపడడంతో సోమవారం వినియోగదారుల సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మంగళవారం సేవలు అందుబాటులో ఉంటాయని డీటీఓ రఘునందన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 44వ నంబర్ జాతీయ రహదారి క్యాంటన్ పార్కు సమీపంలోనూ చెట్లు నేలకొరగడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పిడుగు పడింది. తుర్కపల్లి మండలం గోగులగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన రైతు ధరావత్ చందు నాయక్‌కు చెందిన రెండు జెర్సీ ఆవులు పిడుగుపాటుతో మృత్యువాత పడ్డాయి. పాడి ఆధారంగా జీవనం సాగించే చందు నాయక్ కుటుంబం.. ఆవులు మృతిచెండంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.






