19-12-2025 12:56:26 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారంతో ముగిసింది. గత ఆరు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, ప్రత్యేక విచారణ బృందం ఆయనను ఓ రహస్య ప్రదేశంలో సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో సేకరించిన సమాచా రంతో కూడిన నివేదికను పోలీసులు సిద్ధం చేశారు.
శుక్రవారం ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుండటంతో ప్రభాకర్‌రావు భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించారని బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడల్లా సమాధానం దాటవేసినట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, డేటా ధ్వంసం వెనుక ఉన్నదెవరు అని సిట్ అధికారులు ప్రశ్నించగా.. ఆయన వ్యూహాత్మకంగా మౌనం దాల్చడమో లేదా సంబంధం లేని సమాధానాలు చెప్పడమో చేశారని సమాచారం. విచారణలో ప్రభాకర్‌రావు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు.
అంతా చట్టపరంగానే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జరిగింది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం అనేది కల్పితం. తోటి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు అబద్ధం, వారిని బలవంతం చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు అని ఆయన వాదించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చినట్లు భోగట్టా. వరుసగా ఆరు రోజుల పాటు జరిగిన విచారణను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు.
విచారణ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం ఆయన సిట్ బృందంతో సమీక్ష నిర్వహించారు. ప్రభాకర్‌రావు వెల్లడించిన అంశాలు, ఆయన దాటవేసిన ప్రశ్నలు, కేసులో సేకరించిన ఇతర సాంకేతిక ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ సిద్ధం చేసింది. దీనిని శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.
ప్రభాకర్‌రావు విచారణలో సరైన సమాచారం ఇవ్వలేదని భావిస్తున్న పోలీసులు, ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు ఉన్న ముందస్తు రక్షణను ఎత్తివేసి, అరెస్టుకు అనుమతి ఇవ్వాలని లేదా కస్టడీని పొడిగించాలని పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఈ కేసు తదుపరి గమనం ఆధారపడి ఉంది.