19-12-2025 12:54:18 AM
సంగారెడ్డి, డిసెంబర్ 18 (విజయక్రాంతి): నిజాం కాలం నాటి గంగకత్వ కాల్వ ఆధునీకరణకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల చొరవతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బీజం పడింది. గురువారం సెక్రటేరియట్‌లో జగ్గారెడ్డి సమక్షంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గంగకత్వ కాల్వ ఆధునీకరణ పనులతో పాటు, సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 80 చెరువులకు మరమ్మత్తులు, చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి మూడు రోజుల్లో ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గంగకత్వ కాల్వ ఆధునీకరణ పూర్తయితే సంగారెడ్డి నియోజకవర్గంలోని 33 చెరువులకు నీరందడంతో పాటు 1500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించవచ్చని ఈ సందర్భంగా మంత్రికి జగ్గారెడ్డి వివరించారు.
కాగా 15 కిలో మీటర్ల మేర గంగకత్వ కాల్వ ఆధునీకరణకు రూ.37 కోట్లు, సదాశివపేట మండలంలో 30 చెరువుల మరమ్మత్తులకు రూ.10.72 కోట్లు, సంగారెడ్డిలో 18 చెరువులకు రూ.9.15 కోట్లు, కందిలో 15 చెరువు లకు రూ.8.07 కోట్లు, కొండాపూర్‌లో 4 చెరువులకు రూ.4.16 కోట్లు, సదాశివపేటలోని నంది వాగు, గంగ కత్వ వాగుపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం కోసం రూ.32 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జాద్ హుస్సేన్, ఎస్‌ఈ శ్రీనివాస్, డీఈ బాలగణేశ్‌లు పాల్గొన్నారు.