19 August, 2026 | 6:37 PM

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

19-08-2026 05:49 PM

ఆలేరులో 250 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్ల పంపిణీ

ఆలేరు,(విజయక్రాంతి): కల్లుగీత కార్మికుల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను ఆయన పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో కల్లుగీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను అందిస్తోందని బీర్ల అయిలయ్య తెలిపారు. కార్మికుల ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు.

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి ఆలేరు నియోజకవర్గంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కల్లుగీత కార్మికుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.