7 March, 2026 | 5:46 PM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

07-03-2026 04:32 PM

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 17, 31, 32, 33 వార్డులలో చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్, చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.

క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లలు భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. 17వ వార్డులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలనన్నారు. అనంతరం రాంనగర్ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.