5 May, 2026 | 1:59 AM

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

05-05-2026 12:22 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4(విజయ క్రాంతి):జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, ఎం.డేవిడ్తో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

అలాగే ఇళ్ల గణనలో భాగంగా మే 10లోగా ప్రతి ఉద్యోగి స్వీయ గణన పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజావాణిలో పలు సమస్యలపై దరఖాస్తులు అందాయి. ముఖ్యంగా రహదారి ఆక్రమణలు, పట్టా భూములపై వివాదాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, జాబితాల మార్పులు, సంయుక్త సర్వేలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అనంతరం అధికారులు అర్జిదారుల నుంచి వినతులను స్వీకరించారు.

నిరుద్యోగులు జాబ్ మేళాను వినియోగించుకోండి:-జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 6న ఆదిలాబాద్లో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, ఎం.డేవిడ్తో కలిసి జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకులంలో ఈ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రముఖ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నందున, జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో యువత హాజరై అవకాశాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.