పశువుల అక్రమ రవాణాపై నిఘా
ఎస్పీ నితికా పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (విజయ క్రాంతి):జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ పశువధ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు.జిల్లాలోని సున్నిత ప్రాంతాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 11 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి 24 గంటలు పనిచేస్తూ పశువుల అక్రమ రవాణాపై కఠిన నిఘా ఉంచనున్నాయని చెప్పారు.
పశువుల రవాణా, కొనుగోలు, విక్రయాలు, వధకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పశువుల రవాణాకు ముందు వెటర్నరీ వైద్యుల నుంచి Fit for Transport సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా PCR నెంబర్ 8712670557కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు స్వయంగా వాహనాలను అడ్డుకోవడం, తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలకు దిగకూడదని, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి;- జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీక రించి, వాటి పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 14 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియో గించుకోవాలని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.






