2 May, 2026 | 1:37 AM

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి

02-05-2026 12:16 AM

వనపర్తి, మే 1 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అదనంగా, వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయలలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించి, నిరంతరంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన పిటిషన్ల సంఖ్యను అదే రోజు ముగింపు నాటికి సేకరించి, ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం నివేదికగా పంపించాల్సిందిగా తెలిపారు. ఈ ఫార్మాట్ త్వరలో తెలియజేయబడుతుందని చెప్పారు.

అలాగే, ఫిర్యాదుల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీజీజీ ద్వారా వెబ్ ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి చేయబడుతున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఆర్ డి వో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.