14 August, 2026 | 7:38 PM

మువ్వన్నెల శోభతో భారీ తిరంగా ర్యాలీ

14-08-2026 06:33 PM

ముకరంపుర,(విజయక్రాంతి) భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో తిరంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ ఉత్సవాల్లో భాగంగా, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద ప్రారంభమైన ఈ భారీ తిరంగా ర్యాలీ  శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువత తమ చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని కదం తొక్కడం తో నగర వీధులన్నీ త్రివర్ణ శోభను సంతరించుకుంది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఎం. ధర్మారావు, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, అలాగే బీజేపీ మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు హాజరైనారు. నాయకులు స్వయంగా త్రివర్ణ పతాకాలను చేతబూని "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ నినదించారు. ప్రజలందరూ సమిష్టిగా జాతీయ గీతాన్ని ఆలపించి మాతృభూమికి వందనం చేస్తూ ఈ దేశభక్తియుత కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ మండలాల ఓబిసి మరియు ఎస్సి మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.