2 May, 2026 | 1:52 AM

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

02-05-2026 12:27 AM

అలంపూర్ మే 1: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు రైతులు మృతి చెందారు.అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక మరో వ్యక్తి శుక్రవారం మృతి చెందారు.దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మృతి చెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ హృదయ విదారక ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొయిలదిన్నే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చంద్ర మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి (51) తిక్కారెడ్డి ( 47) రైతులైన ముగ్గురు అన్నదమ్ములు పశు గ్రాసం కోసం గత నెల 28న మంగళవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి కొత్తకోటకు ట్రాక్టర్ లో వెళ్లారు.

ట్రాక్టర్ లో పశుగ్రాసాన్ని వేసుకుని గ్రామానికి బయలు దేరారు.ఎర్రవల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను వెనకనుంచి డీసీఎం ఢీకొట్టడంతో ట్రాక్టర్ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లింది.వరిగడ్డి లోడ్ పై కూర్చున్న వారు జాతీయ రహదారిపై చెల్లాచెదరుగా పడిపోయారు.

ఈ ప్రమాదంలో అన్నదమ్ములు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి, చంద్రమోహన్ రెడ్డిల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా అదేరోజు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి మార్గమధ్యలో మృతి చెందారు. విషమంగా ఉన్న చంద్రమోహన్ రెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్మలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.