4 May, 2026 | 7:44 PM

ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలి

04-05-2026 06:21 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో  ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి  ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్  రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి  ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ,  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు  పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.  నేటి ప్రజావాణి కార్యక్రమంలో 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.