4 May, 2026 | 10:30 PM

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

04-05-2026 09:05 PM

ప్రజావాణికి మొత్తం 47 ఆర్జీలు

సెల్ఫ్ ఎన్నూమరేషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం అవసరం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడిఓసి సమావేశపు మందిరంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.

మండల స్థాయిలోనే ఫిర్యాదులను పరిష్కరిస్తే చిన్న చిన్న సమస్యలకే ప్రజలు కలెక్టరేట్ వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల నాలుగవ తేదీ నుంచి ప్రతి సోమవారం నిర్వహిస్తోందని ప్రజలు అక్కడ కూడా తమ ఆర్జీలను సమర్పించవచ్చన్నారు. కలెక్టరేట్ ప్రజావాణికి ఈ సోమవారం మొత్తం 47 ఆర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.

ప్రజావాణి అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జనాభా గణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్నూమరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి గ్రామపంచాయతీ నుంచి కనీసం వంద మంది పాల్గొనేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తమ వివరాలను సంబంధిత పోర్టల్ లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ఈ విషయంలో సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు షెడ్యూల్ ప్రకారం సంబంధిత శాఖల అధికారులు తమ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.